బిఆర్‌ఎస్ పార్టీలో ఎమ్మెల్యే సీట్ల విషయంలో రచ్చ నడుస్తోంది. ఎవరికి సీటు దక్కుతుంది..ఎవరికి దక్కదనే అంశాలపై పెద్ద చర్చ నడుస్తోంది. ఇప్పటికే కేసిఆర్..అభ్యర్ధులని ఖరారు చేశారని, ఇంకా లిస్ట్ ప్రకటించడమే తరువాయి. ఇప్పటికే సీట్లు దక్కని వారికి క్లారిటీ ఇచ్చేశారని తెలుస్తోంది. దీంతో ఆ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున రచ్చకు దిగుతున్నారు. ఇప్పటికే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి సీటు లేదని తేలిపోయింది.
దీంతో ఆయన ప్రగతి భవన్‌కు క్యూ కట్టారు. ఇంకా పలువురు ఎమ్మెల్యేలు అదే బాటలో ఉన్నారు. అటు మైనంపల్లి హనుమంతరావు..మంత్రి హరీష్‌కు వార్నింగ్ ఇస్తున్న వీడియో హల్చల్ చేస్తుంది. మల్కాజిగిరి అసెంబ్లీ నుంచి తాను, మెదక్ అసెంబ్లీ నుంచి తన తనయుడు పోటీ చేస్తున్నామని మైనంపల్లి చెప్పుకొచ్చారు. మెదక్ అభివృద్ధికి అడ్డుపడింది మంత్రి హరీష్ రావే అని, అవసరమైతే హరీష్ రావు ప్రాతినిధ్యం వహించే సిద్దిపేటలోనూ తన తడాఖా చూపిస్తానని హెచ్చరించారు. మెదక్ లో హరీష్ రావు వేలు పెడితే తాను సిద్దిపేటలో వేలు పెడతానని అన్నారు.
“ రాజకీయాలు ప్రజలకోసమే చేయాలి, పదవుల కోసం కాదు అని చెప్పిన మా తండ్రిగారి మాటలను ప్రతిసారి స్మరించుకుంటు ఆపనిని నా తుది శ్వాస ఉన్నంతవరకు చేస్తానని, నాతో ఉన్నవారందరికి భరోసా ఇస్తున్నాను! దయచేసి నిర్నయాలు మా అందరితొ సంప్రదించి మా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తీసుకోవాలి, లేనిపక్షంలో ఆత్మాభిమానాలు దెబ్బతింటాయి, ప్రజల ఆమోదం లభించదని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ సంచలన పోస్ట్ పెట్టారు.
ఇలా బిఆర్‌ఎస్ లో సీటు కోసం నేతలు పోటీ పడటంతో..అధిష్టానం టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో లిస్ట్ విడుదలయ్యాక బిఆర్‌ఎస్ లో ఎలాంటి పరిస్తితి ఉంటుందో చూడాలి.