తెలంగాణలో రానున్న ఎన్నికల బరిలో దిగనున్న అభ్యర్థుల లిస్ట్‌ను బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. 119 స్థానాలకు గానూ 115 స్థానాలకు అభ్యర్థుల ప్రకటించిన కేసీఆర్.. 4 స్థానాల్లోని అభ్యర్థుల ప్రకటను హోల్డ్‌లో ఉంచారు. అంతేకాకుండా.. ఈ సారి గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ సీఎం కేసీఆర్ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. దీనిపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందిస్తూ.. అభ్యర్థుల ప్రకటనపై సీఎం కేసీఆర్ ముందే కూశారని అన్నారు.
ఎమ్మెల్యేలు పార్టీ మారుతారన్న భయంతో ముందుగానే అభ్యర్థుల జాబితాతో ప్రకటన చేశారన్నారు భట్టి విక్రమార్క. గజ్వేల్‌లో ఓటమి భయంతోనే ఆయన కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారన్నారు. తెలంగాణ తెచ్చుకున్న లక్ష్యం కాంగ్రెస్‌తోనే నెరవేరుతుందన్నారు. పీపుల్స్ ప్రభుత్వ ఏర్పాటుకు సమయం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఫిబ్రవరిలోనే ప్రచారం ప్రారంభించినట్లు భట్టి విక్రమార్క చెప్పారు.
ఎవరైనా ఎన్నికల తేదీలు ఖరారయ్యాక అభ్యర్థులను ప్రకటిస్తారని, కానీ ఎవరు చేజారిపోతోరో అనే భయంతో కేసీఆర్ ముందే ప్రకటించి, నేతలను కాపాడుకునే ప్రయత్నం చేశారన్నారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ పేరుతో తాను ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గంలో అధికార పార్టీ విపరీతంగా నిధులు ఖర్చు చేసిందన్నారు. అయినప్పటికీ సర్వే నివేదికలు చూస్తే బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదని కేసీఆర్‌కు అర్థమైందన్నారు. అందుకే ముందు జాగ్రత్త కోసం మరో నియోజకవర్గంలో కూడా పోటీ చేస్తున్నారన్నారు.
స్వయంగా కేసీఆర్ మరో నియోజకవర్గంలోనూ పోటీ చేస్తుండటంతో ఇక ఆయన బొమ్మ పెట్టుకొని గెలిచే అవకాశం లేదన్నారు. కేసీఆర్ నిత్యం సర్వేలు చేయిస్తుంటారని, గజ్వేల్‌లో ఓడిపోతుందని తేలడంతో కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం దరఖాస్తులను ఆహ్వానించిందని, పరిశీలన జరుగుతోందని, ఈ ప్రక్రియ తర్వాత సమయానుకూలంగా జాబితాను ప్రకటిస్తామన్నారు. ఏ సమయంలో ఎన్నికలు వచ్చినా తాము సిద్ధమన్నారు.