ప్లాస్టిక్ ఇస్తే గుడ్లు ఇవ్వడం ఏంటి? అని అనుకుంటున్నారా.. ఇది నిజమే. కామారెడ్డి జిల్లాలో ప్లాస్టిన్‌ను పూర్తిగా నిర్మూలించాలని కంకణం కట్టుకున్న అధికారులు ఆ దిశగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2 కిలోల ప్లాస్టిక్‌ను సేకరించి ఇస్తే అర డజన్ గుడ్లు ఉచితంగా ఇస్తామని కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ప్లాస్టిక్ నిర్మూలనకు సంబంధించి శనివారం అధికారులతో సమావేశమయ్యారు. ప్లాస్టిక్ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అందులో భాగంగా గుడ్లు ఇవ్వాలనే ప్రతిపాదన తెచ్చారు.
ఈ క్రమంలోనే జిల్లాలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు ఈ కార్యక్రమాన్ని ఈ నెల 4 నుంచి అమలులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ప్రతి గ్రామపంచాయతీతో పాటు మున్సిపాలిటీల పరిధిలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అదే విధంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను బ్యానర్లు సిద్ధం చేసి ప్రదర్శించాలని అధికారులకు సూ చించారు. రెండు కిలోల ప్లాస్టిక్‌ను ఏరివేసిన వారికి స్థానికంగా ఉండే కిరాణ షాపుల ద్వారా గుడ్లను అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.