తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాదాపు 4గంటలుగా సిట్ కార్యాలయంలోనే ఉన్నారు. ఈ రాత్రంతా సీఐడీ ఆఫీసులోనే చంద్రబాబును ఉంచనున్నట్లు తెలుస్తోంది. సీఐడీ డీఐజీ రఘురామిరెడ్డి నేతృత్వంలోని బృందం చంద్రబాబును కార్యాలయంలోని ఐదో ఫ్లోర్లో విచారిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి టీడీపీ అధినేతకు 20కు పైగా ప్రశ్నలు సంధించినట్లుగా తెలుస్తోంది. ముందుగా సిద్ధం చేసుకున్న ప్రశ్నలకు సమాధానాలు రాబడుతున్నారు. ఎస్పీజీ సెక్యూరిటీ సమక్షంలోనే ఆయన విచారణ కొనసాగుతోంది. విచారణ మధ్యలో చంద్రబాబును లాయర్ దమ్మలపాటి శ్రీనివాస్ కలిశారు.
మరోవైపు, చంద్రబాబును కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులు సిట్ కార్యాలయంలో నాలుగో ఫ్లోర్లో చాలాసేపు వేచి చూసి, చివరకు రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో కలిశారు. నారా లోకేశ్, భువనేశ్వరి రెండు మూడు గంటలకు పైగా వేచి చూస్తున్నారు. రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో నందమూరి బాలకృష్ణ, నారా బ్రాహ్మణి చేరుకున్నారు. కాసేపటి క్రితం నలుగురూ టీడీపీ అధినేతను కలిశారు.