స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అవినీతి అరోపణలు ఎదుర్కొంటు ఆరెస్టైన టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే.. ఆయన అరెస్ట్ ఏపీలో సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో.. చంద్రబాబు అరెస్ట్‌పై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తీవ్రస్థాయిలో స్పందించారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ… టీడీపీ అధినేతను అరెస్ట్ చేసిన విధానం సరిగా లేదన్నారు.
ఓ ప్యాక్షనిస్ట్లా అరెస్ట్ చేసి తరలించారని ధ్వజమెత్తారు. అంత చేసినా చంద్రబాబు అదరలేదు.. బెదరలేదని, కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారన్నారు ఉండవల్లి శ్రీదేవి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు ఉండవల్లి శ్రీదేవి.
తాత్కాలికంగా పాపం గెలవవచ్చునని, కానీ అంతిమ విజయం మాత్రం సత్యానిదే అవుతుందని వ్యాఖ్యానించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టారని, కానీ ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. త్వరలోనే ఆయన బెయిల్‌పై వచ్చి రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పులి ఒక అడుగు వెనక్కి వేసినంత మాత్రాన భయపడినట్లు కాదని గుర్తించాలన్నారు.