టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ కెరీర్ లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేయడం తెలిసిందే. ఇవాళ టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో సిరాజ్ 6 వికెట్లు పడగొట్టాడు. ఆసియా కప్-2023 ఫైనల్ ఎంతో హోరాహోరీగా జరుగుతుంది. ఇక ఇందులో సిరాజ్ మియన్ ఆటకు శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. కొలంబో వేదికగా ప్రేమదాస స్టేడియంలో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో భారత పేసర్ల ధాటికి 50 పరుగులకే కుప్పకూలింది. బుమ్రా ఒకటి, సిరాజ్ ఆరు, హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు పడగొట్టారు.
ఒక్క ఓవర్ లోనే నాలుగు వికెట్స్ తీసి దుమ్ములేపిన సిరాజ్… 12 ఓవర్లులో ఆరు వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. దీంతో ఇండియా మొత్తం సిరాజ్ పేరు మారుమ్రోగిపోతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో సిరాజ్ ట్రెండింగ్ లో నిలిచాడు. సిరాజ్ అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా అతడి ఆటను ప్రశంసిస్తున్నారు. తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి సిరాజ్ సంచలనంపై ట్వీట్ చేశాడు. సిరాజ్ ఆడిన ఆట తీరును ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. ” సిరాజ్ మియాన్, మన టోలీచౌకీ కుర్రాడు.. ఆసియా కప్ ఫైనల్‌లో 6 వికెట్లతో మెరిశాడు. అంతేకాకుండా తన సొంత బౌలింగ్‌లో బౌండరీని ఆపడానికి లాంగ్-ఆన్‌కు పరిగెత్తుతున్న పెద్ద హృదయాన్ని కలిగి ఉన్నాడు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక జక్కన్న ట్వీట్ పై క్రికెట్ అభిమానులు సైతం రిప్లై ఇస్తూ.. అవును .. మీరు చెప్పింది నిజమే.. సిరాజ్ మంచి ప్లేయర్ అని చెప్పుకొస్తున్నారు.