కెనడాలో స్థిరపడ్డ పంజాబ్‌కు చెందిన గాయకుడు, 26 ఏళ్ల శుభ్‌నీత్ అక్కడి నుంచే తన ర్యాప్ సింగింగ్ జర్నీని ప్రారంభించాడు. దేశవిదేశాల్లో లైవ్ షోలు ఇస్తూ ఫేమస్ అయ్యాడు. త్వరలోనే భారత్‌లో కూడా శుభ్ షో జరగాల్సి ఉంది. కానీ భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ శుభ్‌నీత్ సింగ్ ఇండియా టూర్ రద్దయ్యింది.
ఖలిస్థానీ ఉద్యమానికి శుభ్ మద్దతు పలుకుతున్నట్లు ఆరోపణలు రావడంతో అతడిపై నెగిటివిటీ పెరిగింది. ఈ క్రమంలోనే స్పాన్సర్లు శుభ్ టూర్‌ను రద్దు చేశారు. ఈ పరిణామాలపై శుభ్ తాజాగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. తానూ భారత్‌లోనే జన్మించానని, పర్యటన రద్దవ్వడం చాలా బాధించిందని పేర్కొన్నాడు. తనపై వచ్చిన ఆరోపణలు చాలా బాధాకరంగా ఉన్నాయని వాపోయాడు. ఇంకా ఏం అన్నాడంటే..?
‘‘పంజాబ్‌కు చెందిన ఓ యువ ర్యాపర్-సింగర్‌గా.. నా మ్యూజిక్‌ను ప్రపంచ వేదికలపై ప్రదర్శించాలనుకోవడం నా కల. కానీ ఇటీవల జరిగిన పరిణామాలు నన్నెంతగానో కుంగదీశాయి. నా ఇండియా టూర్ రద్దవ్వడం చాలా నిరుత్సాహానికి గురిచేసింది. భారత్ నా దేశం కూడా..! నేనూ ఇక్కడే జన్మించా. నా గురువులు, నా పూర్వీకులు అంతా ఇక్కడే ఉన్నారు. నా దేశంలో నా ప్రజల ముందు ప్రదర్శన ఇవ్వాలని ఎంతో ఉత్సాహపడ్డా. కానీ, అది జరగట్లేదు. నాపై వచ్చిన ఆరోపణలు నన్నెంతో బాధించాయి. అయితే వీటికి నేను భయపడను’’ అని శుభ్ తన రాసుకొచ్చాడు.