ప్రజలందరూ చూస్తున్నారు… భవిష్యత్తులో గట్టి సమాధానం ఉంటుంది : నందమూరి సుహాసిని

-

స్కిల్‌ డెవలప్‌ మెంట్ స్కాంలో అరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. చంద్రబాబు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణులు నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ నందమూరి హరికృష్ణ కుమార్తె, తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని ఎలుగెత్తారు. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా ఆమె ఇవాళ హైదరాబాదు ఎన్టీఆర్ ఘాట్ వద్ద పార్టీ నేతలతో కలిసి ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు అరెస్ట్ దారుణం, దుర్మార్గం అని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఆయనను అరెస్ట్ చేశారని నందమూరి సుహాసిని ఆరోపించారు. ఇది అన్యాయమైన పాలన అని నిరూపించే ఘటన అని వివరించారు.

చంద్రబాబు అరెస్ట్, తదనంతర పరిణామాలను యావత్ దేశం గమనిస్తోంది, ఇది అక్రమం అని ప్రజలు కూడా గుర్తించారని తెలిపారు. ఎఫ్ఐఆర్ లో ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని, 23 రోజులుగా ఆయన జైల్లోనే ఉన్నారని అన్నారు. మొన్న నారా లోకేశ్ కు కూడా సమన్లు పంపించారని, రింగ్ రోడ్ వ్యవహారానికి సంబంధించి ఆయనను కూడా జైలుకు పంపించేందుకు దారుణమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని నందమూరి సుహాసిని పేర్కొన్నారు. అసలు, లోకేశ్ ఆ డిపార్ట్ మెంట్ కు మంత్రి కూడా కాదని అన్నారు. చంద్రబాబు విడుదలయ్యేంతరకు తమ నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని నందమూరి సుహాసిని స్పష్టం చేశారు. “తెలుగు ప్రజలందరూ చూస్తున్నారు… భవిష్యత్తులో గట్టి సమాధానం ఉంటుంది… జాగ్రత్త!” అంటూ హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news