వనపర్తి వార్: మంత్రికి పోటీ ఎవరు?

-

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పుడు వాడి వేడిగానే ఉంటాయి. ఈ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట లాంటిది. టిడిపి కూడా కొంత ప్రభావితం చేస్తుంది. గత ఎన్నికల్లో బిఆర్ఎస్ ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రిగా చేస్తున్నారు.

నిరంజన్ రెడ్డి గెలిచిన తర్వాత టిడిపి, కాంగ్రెస్ సైతం లెక్కచేయకుండా తనకంటూ గట్టి క్యాడర్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ నియోజకవర్గంలో బీసీ ఓట్లే ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. విపక్షాలను దెబ్బతీసిన మంత్రి నిరంజన్ రెడ్డి స్వపక్షంలో ఉన్న అసమ్మతి నేతలను పట్టించుకోవడంలో ఆలస్యం చేశారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. నిరంజన్ రెడ్డి పై అసమ్మతితో ఉన్న నేతలు లోక్ నాథ్ రెడ్డితో కలిసి నాలుగు మండలాల ఎంపీపీలు బిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ కంచుకోట లాంటి వనపర్తి నియోజకవర్గం లో రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా కావడంతో ప్రత్యేక శ్రద్ధతో వనపర్తిలో  కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

వేరే పార్టీల నుంచి చేరిన కొత్త నేతలతో వనపర్తికి కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్థులకు కరువేలేదు. ఇటు సీనియర్ నేత చిన్నారెడ్డి ఉన్నారు..అటు శివసేనారెడ్డి, మేఘారెడ్డి ఇద్దరు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. వీరే కాకుండా మాజీ మంత్రి రావుల చంద్రశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకువచ్చి  టికెట్ ఇచ్చి గెలిపించాలి అని రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాడు. అభ్యర్థి ఎవరైనా ఈసారి వనపర్తి లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీకి అసలు అభ్యర్థులే లేరు కానీ వనపర్తి లో తన గుర్తింపును కూడా చాటుకోవాలి అని కాంగ్రెస్ గాలం వేసిన మాజీ మంత్రి రావుల చంద్రశేఖర్ రెడ్డినే బిజెపిలోకి పిలిచి వనపర్తి అభ్యర్థిగా నిలబెట్టాలని ఆలోచిస్తుంది. నిరంజన్ రెడ్డి తో పోటీపడి నిలవగల అంగబలం,అర్ధబలం ఉన్న నేత కోసం బిజెపి ఎదురుచూస్తోంది.

పార్టీతో సంబంధం లేకుండా బిజెపి,కాంగ్రెస్ తో పాటు సొంత పార్టీ అసమ్మతి నేతలు కూడా నిరంజన్ రెడ్డిని ఓడించాలని కంకణం కట్టుకున్నాయి. ఈ చక్ర వ్యూహం నుండి వీరందరి వ్యూహాలను తిప్పికొట్టి నిరంజన్ రెడ్డి విజయం సాధించగలరా అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా పార్టీలు తమ అభ్యర్థులు ఎవరో ప్రకటించే వరకు నియోజకవర్గ రాజకీయాలు ఎలా ఉంటాయో తెలియదు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news