అయ్యో ఎంత ట్రై చేసినా జొన్నరొట్టెలు రావడం లేదా..ఈ ట్రిక్‌ ఫాలో అవ్వండి చాలు.!

-

బరువు తగ్గాలని చాలా మంది రాత్రుళ్లు చపాతీలు, జొన్నరొట్టెలు, రాగిరొట్టెలు వంటివి తింటుంటారు. కానీ ఇలా తిందాం అనుకోని ఒక్కరోజు జొన్నరొట్టెలు చేయగానే ఓపిక మొత్తం పోతుంది. ఎందుకంటే.. అవి చపాతీలలా తేలిగ్గా రావు, విరిగిపోతాయి, ఆ విరిగిన వాటిని ఎలాగోలా కాల్చుకుని తింటే మనకు నచ్చదు. దాంతో మీ వెయిట్‌లాస్‌ ప్లాన్‌ కాస్త ఫ్లాప్‌ అవుతుంది. చపాతీలు చేసినంత సులభం కాదు.. జొన్నరొట్టెలు చేయడం. దానికో ప్లానింగ్‌, పద్ధతి ఉంది మరీ.! ఇప్పుడు మేం చెప్పినట్లు జొన్నరొట్టెలు చేస్తే అస్సలు విరగకుండా చపాతీలు చేసినట్లే ఫటాఫట్‌ చేసేస్తారు.!

జొన్న రొట్టె చేసేటప్పుడు ఈ టిప్స్ పాటించండి :

జొన్న రొట్టెల్ని చేసుకోవడానికి ముందుగా ఓ మందపాటి గిన్నెను గ్యాస్‌ మీద పెట్టి ఓ గ్లాసుడు నీళ్లు పోసి మరగబెట్టండి. అందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. నీళ్లను మరగబెట్టండి. తర్వాత అందులో ఓ కప్పు జొన్న పిండిని వేయండి. గరిటెతో బాగా కలిపి గ్యాస్‌ ఆపేయండి. మూత పెట్టి పది నిమిషాల పాటు అలా వదిలేయండి. ఇది తప్పనిసరిగా చేయాలి. తర్వాత కాస్త గోరు వెచ్చగా ఉన్నప్పుడే పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. కనీసం ఓ పది నిమిషాల పాటైనా దీన్ని బాగా తడుపుకోవాలి. దీనిలో జిగురు ఉండదు కాబట్టి ఇలా చేయడం వల్ల జిగురు ఏర్పడుతుంది. రొట్టెలు చేయడానికి చక్కగా మెత్తగా వస్తాయి.

ఇలా మెత్తగా చేసుకుని పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. కొందరు అరిటాకు లేదా రొట్టెల పీట మీద దీన్ని చేతులతోనే ఒత్తేస్తారు. అందుకు చాలా అనుభవం కావాలి. చపాతీ కర్రతో చేసుకోవాలంటే కాస్త జొన్న పిండిని చల్లుకుని చపాతీల్లా ఒత్తుకోవడమే. అయితే చపాతీలను చేసినంత బలంగా వీటిపై ఎక్కువ ఒత్తిడి కలిగించకూడదు. అలా చేస్తే ఇవి విరిగిపోతాయి. తేలికపాటి బలం ఉపయోగించి మాత్రమే వీటిని ఒత్తుకోవాల్సి ఉంటుంది. ఇలా వీటిని గుండ్రంగా చేసి పక్కనుంచుకోండి.

ఇప్పుడు పొయ్యి వెలిగించి పెనం పెట్టండి. దాన్ని బాగా వేడి కానివ్వండి. తర్వాత రొట్టెను వేసుకున్న వైపు నీళ్లలో ముంచిన తడిగుడ్డతో లేదా చేతినే నీళ్లలో ముంచి రొట్టె అంతటా రాయండి. లేదంటే రొట్టె విరుగుతుంది. మీడియం మంట మీద రెండు వైపులా చక్కగా కాల్చుకోండి. చపాతీలతో పోలిస్తే ఇవి కాలడానికి కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. ఇష్టమున్న వారు కాస్త నూనె వేసుకోవచ్చు. లేదంటే అలానే కాల్చి తీసుకోవచ్చు. చక్కగా పొరలు పొరలుగా జొన్న రొట్టెలు రెడీ అవుతాయి.

పిండి జిగురుగా ఉండాలంటే.. :

జొన్నపిండి పట్టించేటప్పుడే రాగులు, సజ్జలు లాంటివి కలిపి పట్టించుకోవచ్చు. దీనివల్ల పిండి జిగురుతనం కూడా పెరుగుతుంది. రొట్టెలు ఇంకాస్త సులభంగా వస్తాయి. కాకపోతే రాగులు కలిపిన పిండితో చేసిన రొట్టెలు వెంటనే వేడివేడిగా తినేయాలి. వాటిని మరోపూట తినాలంటే కాస్త గట్టిగా అయిపోతాయని గుర్తుంచుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news