ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చంద్రబాబు అరెస్ట్ అంశంతో బాగా హీటెక్కాయి. కానీ ఇప్పుడు మధ్యంతర బెయిల్ మీద విడుదల కావడంతో కాస్త శాంతించాయి అని చెప్పాలి. ఇక తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు ఉన్న కొన్ని మండలాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లిస్ట్ పై మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులే అంటే ప్రభుత్వం కేవలం 103 మండలాలనే ప్రకటించిందంటూ విమర్శించారు. త్వరలోనే మరొక రివ్యూ మీటింగ్ లో మిగిలిన మండలాలను కూడా దుర్భిక్ష మండలాలుగా ప్రకటించాలి అంటూ డిమాండ్ చేశారు సోమిరెడ్డి. అనంతపురంలో ఇటీవల టీడీపీ పర్యటించి దెబ్బతిన్న పంటలను చూసి ఒక నివేదికను తయారుచేసింది అంటూ సోమిరెడ్డి ప్రకటించారు.
ఈ జిల్లాలో నష్టపోయిన వారికి వేరుశెనగకు ఎకరానికి రూ. 25 వేలు మరియు మిరపకు ఎకరాకు రూ. 50 వేలు పరిహారాన్ని అందించి ఆదుకోవాలి అంటూ ప్రభుత్వానికి తెలియచేశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.