‘మహా’ ప్రభుత్వం ఏర్పాటు… ప‌ద‌వుల పంపిణీ ఇలా…

-

గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠ రేపుతోన్న విషయం తెలిసిందే. అక్టోబర్ 24న ఫలితాలు వచ్చిన…ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం సందిగ్ధత నెలకొంది. సీఎం పదవి విషయంలో బీజేపీ-శివసేనల మధ్య వివాదం చెలరేగడంతో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమైంది. ఎన్నికల్లో 288 సీట్లు గాను బీజేపీ-శివసేనలు కలిసి 161 సీట్లు గెలుచుకున్నాయి. అయితే 145 మ్యాజిక్ ఫిగర్ కావడంతో బీజేపీ-శివసేనలకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. కానీ శివసేన సీఎం సీటుని చెరో సగం పంచుకోవాలని డిమాండ్ పెట్టింది.

ఇక దీనికి బీజేపీ ససేమిరా అంది. ఈ పంచాయితీ ఇలా నడుస్తుండగానే గవర్నర్ 105 సీట్లు గెలిచి అతి పెద్ద పార్టీగా ఉన్న బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పిలిచారు. కానీ శివసేన మద్ధతు లేకపోవడంతో ఏర్పాటు చేయలేమని చెప్పింది. ఆ తర్వాత గవర్నర్ 56 సీట్లు గల శివసేనని ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచింది. ఇక శివసేన…కాంగ్రెస్, ఎన్‌సి‌పితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అనుకుని, గవర్నర్ ని కొంత సమయం అడిగారు. గవర్నర్ ఏమో సమయం ఇవ్వకుండా రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయడం, కేంద్రం ఆమోదించడం జరిగిపోయాయి.

అయితే రాష్ట్రపతి పాలన కొనసాగుతుండగానే శివసేన, కాంగ్రెస్, ఎన్‌సి‌పిలు చర్చలకు తెరలేపి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమయ్యాయి. ఈ మూడు పార్టీలకు కామన్ ఎజెండా ఫిక్స్ కావడంతో శుక్రవారం సాయంత్రం గానీ, శనివారం ఉదయం గానీ గవర్నర్ ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని చెప్పనున్నారు. అలాగే ప్రభుత్వ ఏర్పాటు అనంతరం పదవుల పంపకాలపై కూడా మూడు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. సీఎం పిఠాన్ని ఐదేళ్లపాటు శివసేనకు ఇచ్చేందుకు ఎన్సీపీ, కాంగ్రెస్‌ అంగీకరించాయి. కాంగ్రెస్‌కు అసెంబ్లీ స్పీకర్‌, ఎన్సీపీకి మండలి చైర్మన్‌ దక్కేలా నేతలు అంగీకారానికి వచ్చారు.

ఇక శివసేనకు సీఎంతో పాటు 14 మంత్రి పదవులు దక్కనున్నాయి. ఎన్సీపీకి డిప్యూటీ సీఎం, 14 మంత్రి పదవులు, కాంగ్రెస్‌కు డిప్యూటీ సీఎంతో పాటు 12 మంత్రి పదవులు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. అయితే దీనికి మూడు పార్టీల అధినేతలు ఉద్దవ్‌ ఠాక్రే, శరద్‌ పవార్‌, సోనియా గాంధీ అంగీకారం తెలిపారు. మొత్తానికైతే మహారాష్ట్రలో మూడు పార్టీలతో కలిపి ప్రభుత్వం ఏర్పడనుంది.

Read more RELATED
Recommended to you

Latest news