తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. మరోవైపు పలువురు ఇండ్లలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. తనిఖీల్లో అక్కడక్కడ డబ్బు, నగదు పట్టుబడుతున్నాయి. ఎన్నికల సమయం వేళలో ప్రూప్స్ లేకుండా డబ్బును తీసుకోవద్దని వాటిని సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కొందరూ అధికారులను లెక్క చేయనివిధంగా వ్యవహరిస్తున్నారు.
ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ లకు సంబంధించిన కాన్వాయ్ ని తనిఖీలు చేసారు పోలీసులు. తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాన్వాయ్‌ని పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ నుంచి కోరుట్లకు ప్రయాణిస్తున్న కవిత వాహనాన్ని ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు ఎమ్మెల్సీ కవిత పూర్తిగా సహకరించారు. ఆమె వాహనంతో పాటు తన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు చెక్ చేశారు. తనిఖీకి సహకరించిన ఎమ్మెల్సీకి పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.