రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కృష్ణాజిల్లా గన్నవరం వైసీపీలో మరో కలకలం రేగింది. కీలకమైన వైసీపీ నియోజకవర్గం ఇంచార్జ్ పదవికోసం వంశీ వర్సెస్ యార్లగడ్డ వెంకట్రావులు పోటీ పడుతున్నారు. దీంతో ఈ పోస్టును పార్టీ అధినేత, సీఎం జగన్ ఎవరికి కట్టబెట్టనున్నారనే విషయం ఆసక్తిగా మారింది. వాస్తవానికి వంశీ ఇంకా అధికారికంగా వైసీపీలో చేరనేలేదు. అయితే, ఇక్కడ మాత్రం అనధికారికంగా గడిచిన వారం రోజులుగా ఆయనే చక్రం తిప్పుతున్నారు. పోలీసులు కూడా వంశీ నివాసం వద్ద రక్షణ పెంచేశారు. అధికారులు కూడా ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు.
గతంలో వంశీతో మాట్లాడేందుకు కూడా సమయం ఇవ్వని రెవన్యూ అధికారులు ఇప్పుడు ఆయన చుట్టూ తిరుగుతున్నారు. దీంతో యార్లగడ్డ వెంకట్రావు వర్గంలో అలజడి ప్రారంభ మైంది. తమ పరిస్థితి ఏమవుతోందననే భావన వారిలో కలుగుతోంది. ఇదిలావుంటే, తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేయకపోయి నా.. వైసీపీకి మద్దతిస్తానని ప్రకటించిన వంశీ.. ఈ క్రమంలోనే నియోజకవర్గం ఇంచార్జ్‌గా కూడా చక్రం తిప్పాలని భావిస్తు్న్నారు.
ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీలో మరో కీలక నాయకుడు, వైసీపీ పొలిటికల్ సలహా కమిటీ సభ్యుడు దుట్టా రామచంద్రరావుతో తాజాగా భేటీ కావడం, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా విషయం సహా ఇంచార్జ్ విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే, ఏం మాట్లా డారనే విషయం ప్రస్తుతానికి గోప్యంగానే ఉన్నా..
నియోజకవర్గం ఇంచార్జ్ పోస్టు కోసమే వంశీ ప్రయత్నాలు ప్రారంభించారని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితిలో అధికారులు, పోలీసుల వద్దతన మాట చెల్లుబాటు అయ్యేలా ఉండాలంటే.. తనకు అధికారికంగా కాకపోయి నా.. అనదికారికంగా అయినా తనకు ఇంచార్జ్ పోస్టును కన్ఫర్మ్ చేయాల్సిన అవసరాన్ని దుట్టాకు వంశీ వివరించినట్టు తెలుస్తోంది.
అయితే, ఈ సమావేశం అలా ముగియగానే యార్లగడ్డ కూడా వెంటనే మీడియా ముందుకు వచ్చారు. ఇప్పటి వరకు తానే ఇంచార్జ్‌నని ఆయన నొక్కి చెప్పుకొనే ప్రయత్నం చేశారు. నిజానికి ఈ ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో కాట్రగడ్డ భారీగానే సొమ్ములు ఖర్చు చేశారు. అదే సమయంలో వంశీ నుంచి ఎదురైన పరిస్థితిని కూడా తట్టుకుని నిలబడ్డారు. వైసీపీని నిలబెట్టారు. ఈ క్రమంలో ఆయనకు న్యాయం చేయాలనే డిమాండ్ ఆయన అనుచరుల నుంచి కూడా భారీగానే వినిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో గన్నవరం వైసీపీలో నెలకొన్న ఈ కలకలం ఎప్పటికి చల్లారుతుందో చూడాలి.