కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మొదటి రోజు అసెంబ్లీకి ఆర్టీసీ బస్సులో వచ్చారు. నాంపల్లిలో బస్సు ఎక్కి అక్కడి నుంచి అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణంపై ఆయన మహిళలతో ముచ్చటించారు. ఫ్రీ ప్రయాణం గురించి మహిళల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపనికి నివాళులు అర్పించారు.
అమరవీరుల ఆశీస్సులతోనే తాను ఈ స్థాయికి వచ్చానని ఎమ్మెలసీ బల్మూరి వెంకట్ అన్నారు. విద్యార్థుల పక్షాన చేసిన పోరాటాన్ని గుర్తించి వారికి ప్రతినిధిగా తన పార్టీ హైకమాండ్ సభలోకి పంపారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ అగ్రనాయకులు తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఈ సందర్భంగా బల్మూరి వెంకట్ వ్యాఖ్యానించారు. 10 ఏళ్లుగా యువకుల పక్షాన పోరాటం చేశానని చెప్పారు.
“పదేళ్లుగా యువ’కులం’ పక్షాన పోరాడాను. ఇప్పుడు ఆ కులం సమస్యలు తీర్చడానికి నా వంతు కృషి చేస్తాను. అమరవీరుల సాక్షిగా నేను వాగ్దానం చేస్తున్నాను. విద్యార్థులు, యువకులు ఎలాంటి సమస్య ఉన్న నా దృష్టికి తీసుకురండి. ఎప్పటికీ నా కులం యువ’కులమే. ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తాను” అని వెంకట్ అన్నారు.