లోక్సభ ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో బీసీ మంత్రం బలంగా వినిపిస్తోంది.ఇప్పటికే లోక్ సభ అభ్యర్థులపై కసరత్తు చేస్తోన్న ఏపీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయిస్తోంది. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జగన్ ని ఫాలో అవుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో వీలైనంత ఎక్కువ మంది బీసీలకు టికెట్లు కేటాయించే జసరత్తు స్టార్ట్ చేశారు. మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉండగా అందులో కనీసం 7-8 టికెట్లను బీసీలకు కేటాయించే ఆలోచన చేస్తున్నారు.అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీలుపడలేదు కాబట్టి పార్లమెంట్ ఎన్నికలలో బీసీలకు పెద్దపీట వేసే అంశాన్ని సీఎం రేవంత్ పరిశీలిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. ఇందులో మూడు ఎస్సీ, రెండు ఎస్టీ వర్గానికి రిజర్వ్ అయ్యాయి.ఇక హైదరాబాద్ ముస్లింలకు అప్రకటిత రిజర్వడ్ నియోజకవర్గంగా ఉంది. అంటే ఇక జనరల్ కేటగిరిలో పదకొండు స్థానాలు మాత్రమే ఉంటాయి.వీటిలో 7 సీట్లు బీసీలకు కేటాయిస్తే ఇక నాలుగు మాత్రమే ఇతరులకు మిగిలి ఉంటాయి.కానీ అన్ని చోట్లా బలమైన పోటీ దారులు ఓసీలే ఉన్నారు. ఖమ్మంలో రెడ్డి లేదా ఖమ్మ వర్గానికి సీటు కేటాయించాల్సిందే. సోనియా పోటీ చేస్తేనే మినహాయింపు. నల్లగొండ, భువనగిరి, మల్కాజిగిరి, మేడ్చల్, మహబూబ్ నగర్ వంటి చోట్ల బలమైన రెడ్డి సామాజికవర్గ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక కరీంనగర్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఖరారు చేశారని అంటున్నారు. ఇక జహీరాబాద్, నిజామాబాద్ వంటి చోట్ల మాత్రమే బీసీలకు సీట్లు కేటాయించగలరు.
మొత్తంగా చూస్తే బీసీలకు మెజారిటీ సీట్లను కేటాయించడం కష్టమే అంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. ఆయా నియోజకవర్గాల్లో బలమైన బీసీ నేతలు దొరికితే తప్ప ఓసి అభ్యర్థులను మార్చే పరిస్థితి ఉండదు.అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో బీసీ నినాదం బలంగా వినిపించింది. ఎక్కువ టికెట్లు బీసీలకు కేటాయించాలని ఆ సంఘాల నేతలు రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చాయి.ఇక బీసీల వలన కాంగ్రెస్ లో పెద్ద దుమారమే రేగింది.ఏకంగా పీసీసీ పెద్దలను కలిసి బీసీలకు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.అయితే కొన్ని కారణాల వలన ఇది సాధ్యం కాలేదు.అటు రేవంత్ రెడ్డి కూడా బీసీలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పినా ఆచరణలో వీలుపడలేదు. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చే దిశగా సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఎప్పుడూ లేనంతగా ఈసారి చాలామంది లోక్ సభ టికెట్ కోసం దరఖాస్తు చేశారు. మరి టికెట్లు దక్కించుకునే ఆ అదృష్టవంతులెవరో చూడాలి.