టెరాసాఫ్ట్’కు అడ్డగోలుగా ఫైబర్‌నెట్ ప్రాజెక్ట్ ను అప్పనంగా కట్టబెట్టిన ఘనుడు చంద్రబాబేనని తేలిపోయింది. ప్రజాధనాన్ని కొల్లగొట్టడంలో తనది మాస్టర్‌మైండ్ అని చంద్రబాబు మళ్లీ మళ్లీ నిరూపిస్తూనే ఉన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మొత్తం రూ.2 వేల కోట్ల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో రూ.333 కోట్ల విలువైన పనుల్లో అక్రమాలకు బరితెగించారు..
ఐటీ శాఖ చేపట్టాల్సిన ఈ ప్రాజెక్ట్ ను విద్యుత్, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల శాఖ ద్వారా చేపట్టాలని ఆయనే స్వయంగా ఆదేశించారు.అలా టెరాసాఫ్ట్ కంపెనీకి అడ్డగోలుగా ఫైబర్‌నెట్ ప్రాజెక్ట్‌ను కట్టబెట్టడం ద్వారా చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు.చంద్రబాబు తన పథకం ప్రకారం వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ను ఏపీ ఈ-గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యునిగా చేర్చారు. నేర చరిత్ర ఉన్న ఆయనను అంతటి కీలక స్థానంలో నియమించడమే కాదు నిబంధనలను విరుద్ధంగా ఫైబర్‌నెట్ టెండర్ల మదింపు కమిటీలో సభ్యుడిగా కూడా చేర్చారు.
ఫైబర్‌నెట్ కుంభకోణంపై కేసును సీరియస్ గా తీసుకున్న సీఐడీ కీలక ఆధారాలు సేకరించింది.ఇండిపెండెంట్ ఏజెన్సీ ఐబీఐ గ్రూప్ ద్వారా ఆడిటింగ్ జరపడంతో అవినీతి మొత్తం బట్టబయలైంది. టెరాసాఫ్ట్ కంపెనీ నాసిరకం పరికరాలు సరఫరా చేసి ప్రభుత్వాన్ని మోసగించిందని ఐబీఐ గ్రూప్ నిర్ధారించింది. ఫైబర్ నెట్ కుంభకోణంలో నిధులు కొల్లగొట్టిన తీరుపై కీలక అధికారులు వెల్లడించారు. నిబంధనలు పాటించాలని తాము పట్టుబట్టినప్పటికీ అప్పటి సీఎం చంద్రబాబు బేఖాతరు చేశారని ఈ టెండర్ల ప్రక్రియలో క్రియాశీలంగా వ్యవహరించారని వారు సెక్షన్ 164 సీఆర్పీసీ ప్రకారం న్యాయస్థానంలో వాంగ్మూలాన్ని నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో చార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఏ1గా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏ2గా టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ వేమూరి హరికృష్ణ, ఏ3గా ఏపీ ఫైబర్‌నెట్ కార్పొరేషన్, ఇన్‌క్యాప్ సంస్థలకు అప్పటి ఎండీ కోగంటి సాంబశివరావు తోపాటు మరికొందరిని నిందితులుగా పేర్కొంది. వారిపై ఐపీసీ సెక్షన్లు 166, 167, 418, 465, 468, 471, 409, 506 రెడ్ విత్ 120(బి)లతోపాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(2), రెడ్ విత్ 13(1)(సి)(డి) ప్రకారం కేసు నమోదు చేసింది. ఫైబర్‌నెట్ ప్రాజెక్ట్ పేరుతో చంద్రబాబు ముఠా ప్రజాధనాన్ని ఎలా కొల్లగొట్టిందీ సీఐడీ తన చార్జ్‌షీట్‌లో సవివరంగా వివరించింది.
ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ, ఇతర కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.284 కోట్లు విడుదల చేసింది. నకిలీ ఇన్వాయిస్లతో ఆ నిధులను కొల్లగొట్టి, కనుమూరి కోటేశ్వరరావు ద్వారా అక్రమంగా తరలించారు. వాటిలో రూ.144 కోట్లను షెల్ కంపెనీల ద్వారా తరలించారు. ఇక నాసిరకమైన పనులతో కూడా ప్రభుత్వ ఖజానాకు రూ.119.8 కోట్ల నష్టం వాటిల్లిందని నిగ్గు తేల్చింది.