జనసేనాని పవన్ కళ్యాణ్ చుట్టూ ఆసక్తికరమైన రాజకీయాలు నడుస్తున్నాయి. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియక టిడిపి క్యాడర్ తలలు పట్టుకుంటుంది. మరోసారి భీమవరం నుంచి పోటీ చేస్తారని ముఖ్య నేతలు చెబుతున్నప్పటికీ.. పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో అందరూ డైలమాలో ఉన్నారు. గత ఎన్నికల్లో చివరి నిమిషంలో భీమవరం అసెంబ్లీ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. చివరి నిమిషంలో నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవడంతో స్థానిక నేతలు సమన్వయం చేసుకోలేకపోవడం వల్లే పవన్ కళ్యాణ్ ఓడిపోయారని ఆయన పార్టీ నేతలు చెబుతున్నారు. ఈసారి కూడా ఆలస్యం చేస్తే గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే పునరావృతం అవుతాయని భీమవరంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
పవన్ పోటీపై క్లారిటీ లేకపోవడంతో క్యాడర్ గందరగోళంలో ఉందట. గత ఎన్నికల్లో అనుకున్నంత సమయం బలం లేకపోవడంతో పవన్ ఓడిపోయారని జనసేన ఇప్పటికి కూడా చెబుతుంది. అయితే ఈసారి టిడిపి తో పొత్తు ఉండడంతో పాటు ఎక్కువ సమయం ఉన్నప్పటికీ పవన్ సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎనిమిది వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. భీమవరంలో పోటీపై పవన్ కళ్యాణ్ ఆలస్యంగా ప్రకటిస్తే ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయని సొంత పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికీ భీమవరం టిడిపిలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయట. ఇన్చార్జిగా ఉన్న సీతామహాలక్ష్మి వైఖరి నచ్చని టిడిపి నేతలు పార్టీకి దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే క్యాడర్ సహకరిస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..
తెలుగుదేశంతో బిజెపి జనసేన పొత్తు ఉన్న నేపథ్యంలో.. పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే తెలుగుదేశం పార్టీ నుంచి రామాంజనేయులు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారట. ఆయనతోపాటు బిజెపి నుంచి ఒకరిద్దరు కూడా టిక్కట్ ప్రయత్నాలు చేస్తున్నట్లు భీమవరంలో ప్రచారం జరుగుతుంది. దీంతో పవన్ కళ్యాణ్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని లేకపోతే పరిస్థితులు చేయి దాటి పోయే అవకాశాలు ఉన్నాయని జనసైనికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ మదిలో ఏముందో మరి చూడాలి..