ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆరు గ్యారెంటీ లలో భాగంగా ఇప్పటికే నాలుగు గ్యారంటీలను అమలు చేయగా మరొక దానిని అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తున్నారు. అర్హులైన పేదలకు ఇళ్లు నిర్మించే దిశగా ఈనెల 11న ‘ఇందిరమ్మ ఇళ్లు’ స్కీమ్ లాంచ్ చేయనుంది.
అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇల్లు లేని అర్హులందరికీ పథకం వర్తింపజేయాలని, అందుకు అనుగుణంగా వెంటనే విధివిధానాలను తయారు చేయాలని ఆయన సూచించారు.ఈ పథకంలో ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తాము అని తెలిపారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు అందిస్తాము అని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.