దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ బలపడటం ఏమో గాని ఇక్కడి పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళనలో ఇక్కడి రాజకీయ పార్టీలు ఉన్నాయి అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఎవరు ఎన్ని చెప్పినా సరే బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర సంబంధాలు పూర్తిగా దెబ్బ తిన్న సంగతి తెలిసిందే. చాలా వరకు రాష్ట్రాలు కేంద్రంతో సఖ్యతగా లేవు అనేది వాస్తవం. గుజరాత్ సిఎం గా నరేంద్ర మోడీ ఉన్నప్పుడు ఆయన్ను కాంగ్రెస్ ఏమీ ఇబ్బంది పెట్టలేదు.
కాని మోడీ మాత్రం బలపడాలి అధికారం చేపట్టాలి, రాష్ట్రాలను తన గ్రిప్ లో ఉంచుకోవాలి అనే ఆలోచనలో భాగంగా… ఇతర పార్టీల ప్రభుత్వాలకు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణా మీద బిజెపి దృష్టి పెట్టింది. ప్రతీ చిన్న విషయాన్ని భూతద్దం లో పెట్టి రాజకీయం చేస్తుంది ఆ పార్టీ. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డికి హోం మంత్రి పదవి ఇచ్చినప్పుడే అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి అనేది వాస్తవం. ఇప్పుడు తను బలపడటానికి గాను… ఉద్యమం సమయంలో కేసులు ఉన్న తెరాస ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను టార్గెట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ.
ప్రస్తుతం ఆ పార్టీ అధినేత అమిత్ షా ఝార్ఖండ్ ఎన్నికల హడావుడిలో ఉన్నారు. అది పూర్తి కాగానే ఆయన… తెలంగాణాలో కొందరి మీద ఐటి దాడులు, ఉద్యమం సమయంలో కేంద్ర ప్రభుత్వ ఆస్తులకు భంగం కలిగించారు అనే కేసులను తిరగదోడే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఇక కొందరి ఎమ్మెల్యేల మీద ఐటి దాడులు కూడా చేసే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. త్వరలో కొన్ని సంచలనాలు కూడా నమోదు అయ్యే అవకాశ౦ ఉందని అంటున్నారు.