నిరుద్యోగులకు తెలుగుదేశం పార్టీ చీఫ్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక హమీలు ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం విజయనగరం జిల్లాలోని రాజం ప్రజా గళం సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే 25 వేల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని అన్నారు .అన్నదాత పథకం కింద ప్రతిరైతుకు ఏడాదికి రూ.25 వేలు ఇస్తాం. రాష్ట్రంలోని ప్రతిపేద వాడికి రూ.4 వేల పింఛన్ అందిస్తామని తెలిపారు.
వెనకబడిన వర్గాలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిననాటి నుండి పన్నులతో ప్రజల నడ్డి విరుస్తున్నారని.. ప్రజలకు రూ.10 ఇచ్చి.. రూ.100 తీసుకుంటున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో రాక్షస పాలన కొనసాగుతోందని చంద్రబాబు నిప్పులు చెరిగారు. వైసీపీ రాక్షస పాలనను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.