కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్, బీ, యూ టాక్స్ వసూలు జరుగుతుందని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డిలు వైట్ పేపర్ లాంటి వారని అలాంటి వైట్ పేపర్ల పై మహేశ్వర్ రెడ్డి కావాలనే ఇంక్ చల్లుతున్నారని ధ్వజమెత్తారు.
తన గుర్తింపు కోసమే మహేశ్వర్ రెడ్డి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తమ్ ఆచితూచి పని చేసుకుంటూ పోయే వ్యక్తి అని, ఆయన ఎవ్వరి ట్రాప్ లో పడే వ్యక్తి కాదన్నారు. రోజుకో ట్యాక్స్ పేరుతో మాట్లాడుతున్న మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడటం కాకుండా తన వద్ద వాస్తవంగా ఆధారాలు ఉంటే వాటిని మీడియాకు అప్పగించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లేవని ఇకనైనా మహేశ్వర్ రెడ్డి ఇటువంటి అసత్యాలను, అబద్దాలను ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు.