తల్లి పాలు, తల్లిపాల ఉత్పత్తుల విక్రయానికి దేశంలో ఎలాంటి అనుమతి లేదని భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ (FSSAI) స్పష్టం చేసింది. FSS చట్టం 2 వేల 6 నిబంధనల ప్రకారం మానవ పాల ప్రాసెసింగ్, విక్రయాలకు అనుమతిలేదని తేల్చి చెప్పింది. ఈ నిబంధన ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. తల్లిపాల వాణిజ్యీకరణ సంబంధిత కార్యకలాపాలను వెంటనే ఆపేయాలనీ లేదంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని FSSAI స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
కేంద్ర, రాష్ట్రాల లైసెన్సింగ్ అథారిటీలు ఇలాంటి కార్యకలాపాలు నిర్వహించే యూనిట్లకు అనుమతి ఇవ్వకూడదని ఆదేశాలు జారీ చేసింది. దాతల నుంచి సేకరించిన తల్లిపాలు వాణిజ్య ప్రయోజనాల కోసం కాదనీ.. సమగ్ర చనుబాల నిర్వహణ కేంద్రాలతో కూడిన ఆరోగ్య సౌకర్యాల్లో చేరిన నవజాత శిశువులు మాత్రమే వాటిని అందించాలని స్పష్టం చేసింది. తల్లి పాలను దాత ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు లేకుండా ఉచితంగా స్వచ్ఛందంగా మాత్రమే దానం చేసే వీలుంటుందని పేర్కొంది. సేకరించిన పాలను ఆసుపత్రిలో నవజాత శిశువులు, అవసరమైన ఇతర పసికందులకు ఉచితంగా అందించాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి