పాత కాంగ్రెసోళ్లు, కొత్త కాంగ్రెసోళ్లు…. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ ఈ వివాదం తెరపైకొచ్చింది.పదవులు ఆశించి ఇతర పార్టీల నుంచి వస్తున్న నేతలు… చాలాకాలం నుంచి పార్టీలో ఉంటూ కష్ట నష్టాల్లో జెండా మోసిన వాళ్ళు ఏదో ఒక హోదా కావాలని తాపత్రయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో పాత కొత్త అనే మాట తరచుగా వినిపిస్తోంది. పదవుల విషయంలో అందరూ పోటీ పడుతుంటంతో సీఎం రేవంత్ రెడ్డికి ఏం చేయాలో తోచడం లేదు. రేవంత్ రెడ్డి ఇచ్చిన మంత్రివర్గ జాబితాపై సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా మంత్రివర్గ విస్తరణ మాత్రం కొలిక్కి రావడం లేదు. పీసీసీ చీప్ పదవి విషయంలోనూ పార్టీలో చీలికలు వచ్చినట్లుగా చర్చ జరుగుతోంది.దీంతో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి.
నల్లగొండ జిల్లాకు చెందిన ఓ మంత్రి ఢిల్లీలోనే నాలుగైదు రోజులుగా మకాం వేసి కూర్చున్నాడు. ఢిల్లీ పెద్దలను కలుస్తూ తన ఫ్యామిలీలోనూ మంత్రి పదవి కావాలంటూ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆ మంత్రికి, సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది.మరోవైపు నల్లగొండ జిల్లాకు మంత్రి పదవి కేటాయిస్తే వేరే వర్గం వారికి ఇవ్వాలనే డిమాండ్ వచ్చినట్లు టాక్. శాసనసభలో కీలకంగా ఉన్న ఓ ఎమ్మెల్సీని పార్టీలో చేర్చుకొని అతనికి మంత్రి పదవి ఇస్తారనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. దీంతో ఒక్క నల్లగొండ జిల్లాలోనే మంత్రి పదవి రేసులో నలుగురి పేర్లు తెర మీదకు వచ్చాయి.
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంత్రిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని తెలుస్తోంది. ఆదిలాబాదు జిల్లా నుండి ప్రేమ్ సాగర్ రావుకు ఇవ్వాలని భట్టి పట్టుబడుతుoడగా రేవంత్ రెడ్డి మాత్రం అదే జిల్లాకు చెందిన వివేక్ కు ఇవ్వాలని చూస్తున్నట్లు టాక్ నడుస్తోంది.నిజామాబాద్ జిల్లా నుండి సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముదిరాజ్ కోటాలో వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది.అటూ పీసీసీ చీఫ్ విషయంలోనూ కొత్తోళ్లు, పాతోళ్ల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని సమాచారం.నిన్ననే పార్టీలో చేరిన కేశవరావు పీసీసీ పదవి ఆశిస్తున్నారు. కేశవ్ రావు అభ్యర్థిత్వాన్ని కొందరు సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. చివరికి ఈ రాజకీయం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.