విశాఖకే టాలీవుడ్‌ మొగ్గు.. శరవేగంగా రాజధాని అభివృద్ధి.. ఇదే సర్కారు వ్యూహం!

-

రాజధాని ప్రాంతంలో దాదాపు నాలుగున్నరేళ్ల నుంచి ప్రజల నాలుకలపై తచ్చాడిన అమరావతి విషయంలో జగన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అమరావతి ప్రాంత ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. రైతులు ఆందోళన చేస్తున్నారు. దీనికి రాజకీయ పక్షాల నుంచి మద్దతు కూడా లభించింది. ఇది ఒక భాగంగా పక్కన పెడితే.. జగన్‌ సర్కారు భుజాలకు ఎత్తుకున్న విశాఖ రాజధానిపై ఏయే వర్గాలు సానుకూలంగా ఉన్నాయి? ఎవరెవరు హర్షం వ్యక్తం చేస్తున్నారు? వంటి విషయాలపైనా చర్చ చేపడితే.. కొన్ని వ్యూహాత్మక విషయాలు వెలుగు చూస్తున్నాయనేది వాస్తవం. ముఖ్యంగా అమరావతిలో అన్నీ ఏర్పాటు చేసి.. నిర్మాణాలు పూర్తి చేసే సరికి పుణ్యకాలం గడిచిపోవడం ఖాయం.

అదే సమయంలో ప్రభుత్వానికి కూడా భారీ ఎత్తున ఖర్చు. ఇదంతా తడిసిమోపెడై.. ఈ ఖర్చును రాబట్టుకునేసరికి మరింత కాలం పడుతుంది. అప్పటికి ఎన్ని ప్రభుత్వాలు మారతాయో.. తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జగన్‌ వ్యూహాత్మకంగా విశాఖను ఎంపిక చేసుకున్నారనే సానుకూల వాదన కూడా వినిపిస్తోంది. దీనికి నేపథ్యం గడిచిన ఆరు మాసాల కిందటే ఉందని కూడా అంటున్నారు. సహజంగా టాలీవుడ్‌, ఐటీ, పరిశ్రమలు వంటివి వస్తేనే తప్ప ఏ ప్రాంతమైనా అభివృద్ధి విషయంలో పుంజుకునే అవకాశం లేదు. దీనికి హైదరాబాద్‌ కూడా ప్రత్యక్ష ఉదాహరణ. తెలుగు చిత్రసీమ మొత్తం చెన్నైలో ఉన్న సమయంలో ఏపీలో ని హైదరాబాద్‌ పెద్దగా అభివృద్ధి చెందిన దాఖలాలు లేవు.

అదే సమయంలో ఐటీ అంతా బెంగళూరులోనే ఉన్నసమయంలో హైదరాబాద్‌ను పట్టించుకున్న నాధుడు లేరు. ఇప్పుడు ఈ రెండు కూడా అమరావతికి వచ్చేందుకు ఎంతలేదన్నా కనీసంలో కనీసం పదేళ్లకు పైగానే పడుతుంది. పైగా విజయవాడ, గుంటూరులను జంట నగరాలుగా అభివృద్ధి చేసేందుకు కూడా సమయం, డబ్బు పడతాయనేది మేధావుల మాట. విశాఖను తీసుకుంటే.. ఇప్పటికే ఇక్కడ టాలీవుడ్‌ ఆనవాళ్లు ఉన్నాయి. ప్రముఖ నిర్మాత రామానాయుడు స్టూడియో కూడా ఉంది. అదేసమయంలో ప్రకృతి అందాలకు విశాఖ పట్టుకొమ్మ. విశాలమైన ప్రాంతాలు కలిసి వస్తున్నాయి.

ఇక, ఐటీ కూడా ఇప్పటికే ఉంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. పక్కనే సుదీర్ఘ సముద్రతీరంతోపాటు అంతర్జాతీయ విమానాశ్రయం, విశాలమైన రోడ్లు కలిసి వస్తున్నాయి. దీంతో కేవలం నాలుగు నుంచి ఐదేళ్లలోనే విశాఖ అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెంది, టాలీవుడ్‌ మొత్తం కూడా ఇక్కడకు డంప్‌ అయ్యే పరిణామాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆదాయం ఊపందుకోవడం ఖాయంగా ఉంది. ఈ విషయాలపై ఉన్న అవగాహనతో నే జగన్‌ విశాఖను ఎంచుకున్నారనేది విశ్లేషకుల అభిప్రాయం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news