వాయుగుండం ప్రభావంతో ఏపీలోని కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. భారీ వర్షాలతో పోటెత్తిన వరదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లు తెగి చాలా ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వీధుల్లోకి నీళ్లు చేరి రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లింది. మరోవైపు ఇవాళ సాయంత్రానికి వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారనుండటంతో ఉత్తర, దక్షిణ కోస్తాలతోపాటు రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో పలుచోట్ల ముంచెత్తుతున్న వరదలతో సమీప గ్రామాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఎకరాలకు పైగా వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అంచనా. శనివారం సాయంత్రానికి ధవళేశ్వరం వద్ద 4.09 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని.. సోమవారం ఉదయానికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుతుందని అధికారులు అంచనా వేశారు.