ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి స్థానిక సంస్థలను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయాలకు తెరతీశారు కూటమి ప్రభుత్వంలోని పెద్దలు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం చేత అటు మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ, జడ్పిటిసి వంటి వాటిని కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి సొంతూరు కుప్పం మునిసిపాలిటీలో వైసీపీని ఖాళీ చేయించారు. ఇదే క్రమంలో పుంగనూరులో వైసిపి కౌన్సిలర్‌లను తెలుగుదేశం పార్టీ వైపునకు తిప్పుకునేందుకు ప్లాన్ వేసింది.
అక్కడ వైసీపీ కౌన్సిలర్‌లు టీడీపీలోకి వెళ్లబోతున్నారనే ప్రచారానికి తెరతీసింది. అటు చిత్తూరు జిల్లా కూడా తెలుగుదేశం పార్టీ ఖాతాలోకే వెళ్తుందని టాక్ నడుస్తోంది. వైజాగ్ మునిసిపల్ కార్పోరేషన్‌లో కూడా కార్నొరేటర్‌లను టీడీపీలోకి చేర్చుకుంటున్నారు. ఈ విధంగా స్థానిక సంస్థలన్నింటినీ కూటమి కైవసం చేసుకోవాలని అనుకుంటోంది. ఇదే విధంగా జగన్ సొంత జిల్లా కడపలో కూడా వైసిపిని దెబ్బకొట్టడానికి టీడీపీ పావులు కదుపుతోంది.
ఏపీలో పూర్తిగా రాజకీయాలను చేతిలోకి తీసుకోవాలని కూటమి చేస్తున్న ప్రయత్నాలకు దెబ్బకొట్టే విధంగా వైసీపీ అలెర్ట్ అయింది. కూటమి చేసే ప్రయత్నాలు బెజవాడలో మాత్రం సఫలం కాలేదు. విజయవాడ స్టాండింగ్ కమిటీకి సంబంధించి జరిగినటువంటి ఎన్నికలలో వైసిపి విజయం సాధించింది. అన్ని స్థానాలను వైసీపీ కైవసం చేసుకుని కూటమికి పెద్ద ఝలక్ ఇచ్చింది వైసీపీ. అక్కడ కూటమి చేసిన ప్రయత్నాలు ఫలించలేదనే చెప్పాలి. తాజాగా కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్‌లోనూ ఇదే రిపీట్ అయింది. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ లో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయి.
ఇక్కడున్న ఐదు స్థానాలకు గాను అన్నింటినీ వైసీపీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో మాజీఎమ్మెల్యే ఎస్‌వి మోహన్‌రెడ్డి, మేయర్ రామయ్య, పలువురు కార్పొరేటర్‌లు స్థానిక వైఎస్ఆర్ విగ్రహ కూడలిలో సంబరాలు చేసుకున్నారు. అక్కడ కూడా కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సాక్షాత్రు మంత్రి టీజీ భరత్ రంగంలోకి దిగినా కూటమికి అక్కడ పరాభవమే ఎదురైంది.
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అయితే దీనిపై కూటమిలోని పలువురు నేతలు దారుణంగా ట్రోల్స్ చేశారు. వైసీపీ ఇక కనిపించదనే కామెంట్లు కూడా విసిరారు. ఇలాంటి సమయంలో టీడీపీకి కనీస అవకాశం ఇవ్వకుండా వైసీపీ చెలరేగిపోవడంతో కూటమికి దిక్కుతోచడం లేదు. పైగా అన్ని చోట్లా వైసీపీ మళ్లీ పుంజుకునేలా కూడా కనిపిస్తూ ఉండడంతో కూటమికి మైండ్ బ్లాక్ అవుతోంది.
దీంతో వైసీపీ కార్యకర్తలు నేతలకు సైతం ఇది మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఈ నెలలోనే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరుగనుంది. వైసీపీ ఇప్పటికే అభ్యర్ధిని ప్రకటించి విజయంపై ధీమాగా ఉంది. ఓట్ల పరంగా వైసీపీకే మెజారిటీ ఉండటంతో ఖచ్చితంగా గెలుస్తామని అంటున్నారు. అయితే పార్టీలో చేర్చుకునే కార్యక్రమాలను టీడీపీ ముమ్మరం చేసినా లాభం లేకుండా పోతోంది. విశాఖలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని అటు విశ్లేషకులు భావిస్తున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2029 ఎన్నికలలో వైసీపీ సంచలన విజయం నమోదు చేయడం ఖాయమనే టాక్ నడుస్తోంది.