అసెంబ్లీలో బీర్‌ఎస్ గొంతు నొక్కారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జీరో అవర్ మొత్తం ఎత్తివేశారని, ప్రశ్నోత్తరాలు లేకుండా చేశారని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సభలో చర్చలకు అవకాశం ఇవ్వలేదని.. ప్రజా సమస్యలపై మాట్లాడదామంటే మైకులు కట్టేశారని.. ఇదేంటని అడిగితే మార్షల్స్‌తో బయటకు తరలించారని మండిపడ్డారు.
కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్‌ను తిట్టడానికే అసెంబ్లీని వినియోగించుకున్నారని వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. ఏడు నెలల్లోనే రేవంత్ రెడ్డి వికృతరూపం బయటపడిందని విమర్శించారు. రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదు.. నియంతృత్వ పాలన అని ఎద్దేవా చేశారు. ఇంత అధ్వాన్నంగా సభ ఎప్పుడూ జరగలేదని అక్బరుద్దీన్ కూడా అన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్ మిత్రపక్షమని చెబుతున్న ఎంఐఎం కూడా కాంగ్రెస్ తీరును తప్పుబట్టిందని తెలిపారు. రేవంత్ సభా నాయకుడిగా కాకుండా అటవిక రాజులా వ్యవహరించారని అన్నారు. సీఎం ఇష్టారాజ్యంగా సభను తప్పుడు దోవ పట్టించారని విమర్శించారు. ఏ చర్చపై కూడా పూర్తిగా మాట్లాడనివ్లేదని అన్నారు.