సాధారణంగా ఎవరికైనా రోడ్డు మీద ప్రమాదం జరిగినప్పుడు వారికి సాయం చేయడమో.. లేదా 108కి కాల్ చేయడమో చేస్తుంటాం. కానీ ఉత్తర్ ప్రదేశ్లో మాత్రం ఓవైపు రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మరణించి.. క్లీనర్ తీవ్ర గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే.. మరోవైపు జనం మాత్రం పాల కోసం ఎగబడ్డారు. మానవత్వానికి మచ్చ తెచ్చిన ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
గాజియాబాద్‌లో మంగళవారం రోజున ఓ పాల ట్యాంకర్‌ను వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఝార్ఖండ్‌కు చెందిన లారీ డ్రైవర్ ప్రేమ్ సాగర్ (45) అక్కడికక్కడే మృతి చెందగా క్లీనర్ తీవ్రంగా గాయపడ్డాడు. మేరఠ్ వెళ్తుండగా దిల్లీ – మేరఠ్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఏబీఈఎస్ కాలేజ్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో లారీ నుజ్జనుజ్జయ్యింది. ట్యాంకర్ కూడా దెబ్బతినడంతో పాలు బయటకు రాగా.. గమనించిన స్థానికులు పాత్రలు, బాటిళ్లలో నింపుకుని వెళ్లిపోయారు. అంతేగానీ అక్కడే పడి ఉన్న గాయపడిన క్లీనర్‌ను, డ్రైవర్ మృతదేహాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కనీసం 108కి కూడా కాల్ చేయలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.