ఏపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు రైల్వేస్టేషన్ సమీపంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పెద్దలు వీరి వివాహానికి అంగీకరించకపోవడమే కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనలో ప్రియుడు రాజేశ్ మృతి చెందగా, ప్రియురాలు సత్య శ్రావణికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు రాజేశ్ గణపవరం గ్రామానికి చెందిన వాడు కాగా, ప్రియురాలు ఎస్ కొండేపాడు గ్రామానికి చెందిన అమ్మాయిగా పోలీసులు గుర్తించారు.
శుక్రవారం తెల్లవారుజామున ప్రేమికులిద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు రైల్వే స్టేషన్ సమీపానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రియురాలు సత్యశ్రావణి పరిస్థితి కూడా విషయంగా ఉన్నట్లు సమాచారం.ఆమె కోలుకుంటే వీరిద్దరూ ఆత్మహత్యకు ఎందుకు యత్నించారనే విషయం స్పష్టంకానుంది. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.