రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఇక అటు విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి మళ్లీ వరద ఉధృతి కొనసాగుతుండగా.. ఇటు ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద మళ్లీ పొటెత్తుతోంది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో మంత్రి సీతక్క రంగంలోకి దిగారు.
జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన సీతక్క ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. అధికారులు అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు సమాచారం. ఖమ్మం మున్నేరు వాగుకు వదర ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ప్రస్తుతం 14 అడుగుల మేర వరద వస్తోంది. ఇప్పటికే వరద పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరోవైపు రైల్వే అధికారులు కూడా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.