ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత సంబంధిత అధికారులను ఆదేశించారు. విజయవాడలకు భారీ వర్షం ముంపు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మరోసారి ముంపు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని కోరారు. అధికారులు, సిబ్బంది ప్రతిక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఆమె భరోసా నిచ్చారు.
ఆదివారం ఉదయం తాడేపల్లిలోని డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయంలో నీటి ప్రవాహంపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అంచనా వేయడానికి అనుగుణంగా మిగిలిన శాఖలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. కాగా, ప్రస్తుతం బుడమేరు, పులివాగుతో పాటు ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు కొనసాగుతోంది. దీంతో విజయవాడ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.