దసరా పండుగను పెద్ద ఎత్తున హిందువులు జరుపుకుంటారు. తల్లిని దేవతగా పూజించడం శ్రద్ధాభావ వికాసంలోని పద్ధతి. సరస్వతీ, మహాలక్ష్మి, శాకంబరి ఇలా అమ్మవారిని ఆరాధించి ఐశ్వర్య, సౌభాగ్య, సంపదలను పొందాలని అనుకుంటారు. నవరాత్రుల ఉత్సవాల్లో అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరిస్తారు. నైవేద్యాలని కూడా ఒక్కో వంటకాన్ని సమర్పిస్తారు. నవ అవతారాలని అత్యంత భక్తితో పూజించే పర్వదినాలు ఈ శరన్నవరాత్రులు. అశ్వాయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి దాకా పరమేశ్వరి 9 రూపాలను ఆరాధిస్తారు.
మొదటి రోజు- శైలపుత్రి అలంకారంలో (స్వర్ణకవచాలంకృత దుర్గమ్మగా) అలంకరించాలి. కట్టె పొంగలిని సమర్పిస్తారు. శ్రీశైల సంప్రదాయం ప్రకారం కదంబం, మినపవడలు, రవ్వ కేసరి, పానకం పెడతారు.
రెండో రోజు- అమ్మ బాలా త్రిపుర సుందరి. నైవేద్యంగా పులిహోర సమర్పిస్తారు.
మూడో రోజు- గాయత్రీదేవి రూపంలో అలంకరిస్తారు. కొబ్బరి అన్నం, పాయసం సమర్పిస్తారు.
నాలుగో రోజు – అన్నపూర్ణదేవిగా అలంకరిస్తారు. మినప గారెలు, మొక్కజొన్న వడలు పెడతారు.
ఐదో రోజు – లలితా దేవి గా దర్శనమిస్తుంది. నైవేద్యంగా దద్ద్యోజనం పెడతారు.
ఆరవ రోజు – మహాలక్ష్మీగా దర్శనమిస్తారు. నైవేద్యంగా కేసరి పెడతారు.
ఏడో రోజు – సరస్వతి రూపంలో దర్శనమిస్తుంది. నైవేద్యంగా పరమాన్నం, అల్లం గారెలు సమర్పిస్తారు.
ఎనిమిదవ రోజు – దుర్గాదేవి రూపంలో అలంకరిస్తారు. నైవేద్యంగా శాకాన్నం లేదా కలగూర పులుసు పెడతారు.
తొమ్మిదో రోజు – మహిషాసురమర్దినిగా అలంకరిస్తారు. రవ్వతో చక్రపొంగలి, చక్కర పొంగల్ సమర్పిస్తారు.
పదో రోజు – శ్రీరాజరాజేశ్వరి దేవిగా అమ్మవారిని అలంకరిస్తారు. నైవేద్యంగా సేమ్యా పాయసం, కొబ్బరి పాయసం, కొబ్బరన్నం, పరమాన్నం పెడతారు.