దీపావళి రోజున అందరూ ఇండ్లలో, దుకాణాలలో లక్ష్మీ పూజలు నిర్వహిస్తారు. దీనికోసం ఇండ్లను రంగురంగుల పూలతో అలంకరిస్తారు. అలాగే వ్యాపార సంస్థలను సైతం వివిధ రకాల పూలతో డెకొరేట్ చేసి ఘనంగా లక్ష్మీ పూజలు నిర్వహిస్తారు.
అయితే పూజలు పూర్తయిపోయి ఒక రోజు అయిన తర్వాత.. అలంకరించిన పూలు వాటి మునుపటి కళను కోల్పోతాయి. సాధారణంగా అలాంటి వాటిని తీసి వేసి పక్కన పడేస్తారు. అలా చేయకుండా, ఆ పూలను రకరకాలుగా ఉపయోగించవచ్చు.
సహజసిద్ధమైన రంగు తయారీ:
ఎస్.. మీరు విన్నది నిజమే. పూలతో సహజసిద్ధంగా రంగులను తయారు చేయవచ్చు. బంతి, చామంతి, మందారం మొదలైన పూలను ఉపయోగించి చూడముచ్చటగా కనిపించే రంగులను తయారు చేయవచ్చు.
ముందుగా నీళ్లలో పూలను వేసి బాగా మరిగించండి. ఆ తర్వాత వడపోసి వ్యర్థ పదార్థాలను పక్కన పడేయండి. మిగిలిన నీళ్లు రంగుగా మారడం మీరు గమనించవచ్చు. దీన్ని చాలా రకాలుగా వాడవచ్చు.
పూలరేకులతో డ్రాయింగ్:
మీలో మంచి కళాకారుడు ఉన్నట్లయితే పూలరేకులతో అందమైన ఆర్ట్ తయారు చేయండి. రేకులన్నింటినీ తీసుకుని కాన్వాస్ మీద మీకు నచ్చిన డ్రాయింగ్ గీసుకొని.. దాన్ని పూల రేకులతో నింపండి. ఇలా చూడటానికి అద్భుతంగా ఉంటుంది.
కంపోస్ట్ చేయండి:
వాడిపోయిన పూలని పక్కన పారవేయకుండా.. కంపోస్ట్ ఎరువు తయారీలో ఉపయోగించండి. దీనివల్ల పర్యావరణానికి నష్టం కలగకుండా ఉంటుంది.
పర్సనలైజ్డ్ కార్డ్:
వాడిపోయిన పూల లోంచి ఒక దాన్ని తీసుకుని.. మీకు నచ్చిన పుస్తకంలో.. మధ్య పేజీలో ఆ పువ్వుని ఉంచండి. ఆ తర్వాత దానిమీద ఎక్కువ బరువు గల పుస్తకాలను పెట్టండి. రెండు వారాల తర్వాత ఆ పుస్తకాన్ని బయటకు తీసి దానిలోని పువ్వును చూడండి. పూర్తిగా నలిగిపోయి పుస్తకంలోని పేపర్ కి అతుక్కుని అందంగా కనిపిస్తుంది.