2014కు ముందు ఏర్పడిన రాజకీయ పార్టీ జనసేన. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేరగా ఏర్పాటు చేసిన ఈ పార్టీ ప్రారంభంలోనే అనేక సంచనాలకు వేదికగా మారుతుందని అందరూ అనుకున్నారు. అయితే, అనూహ్యం గా 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటూ.. అదే ఎన్నికల్లో బీజేపీ=టీడీపీ మిత్రబంధానికి తమ చేతులు కూడా కలిపి వారికి సపోర్ట్ చేసింది. ఈ క్రమంలో మేధావులు తమ పార్టీలో చేరాలని పవన్ పిలుపు నిచ్చారు. దీంతో చాలా మంది మేదావులు, డాక్టర్లు, రిటైర్డ్ ప్రొఫెసర్లు, పోలీసులు, సమాజంలో మంచి గుర్తింపు ఉన్న వారు కూడా పవన్ వెంట నడిచేందుకు ముందుకు వచ్చారు.
ఇక, 2019 ఎన్నికల్లో పార్టీ పోటీ చేసింది. దీనికి ముందు పవన్ ఎన్నికల్లో యువతకే పెద్దపీట వేస్తానని చెప్పా రు ముఖ్యంగా అసెంబ్లీ, పార్లమెంటు వంటి చట్టసభల్లో మేధావులు ఉండాల్సిన అవసరం ఉందని, వారికే టికెట్లు ఇస్తానని చెప్పారు. దీంతో ప్రత్యక్ష ఎన్నికలపై ఆశలు పెట్టుకున్న మేధావి వర్గం పవన్‌కు జై కొట్టింది ఇదిలావుంటే, యువతకు పెద్ద ఎత్తున పరీక్షలు పెట్టి, వివిధ రూపాల్లో ఎంపిక చేసుకుని వారికి కూడా టికెట్లు ఇస్తామని అనడంతో లెక్చరర్లు.. సహా సాఫ్ట్ వేర్ నిపుణులు కూడా జనసేనలోకి చేరిపోవాలని ఉవ్విళ్లూరారు.
ఇంతలో ఎన్నికలు రానే వచ్చాయి. అన్నిపార్టీలకూ భిన్నంగా జనసేన ఉంటుందని ఆశలు పెట్టుకున్నవారిపై నీళ్లు జల్లారు జనసేనాని. అప్పటి వరకు అన్ని పార్టీలూ అనుసరిస్తున్న విధానానికి భిన్నంగా పవన్ వ్యవహరిస్తారని అనుకున్నా.. అనూహ్యంగా పవన్ కూడా వారి బాటలోనే నడిచారు. ఒకరిద్దరు మేధావులకు టికెట్లు ఇచ్చినా.. చాలా మందిని కేవలం కార్యాలయానికే పరిమితం చేశారు. ఇక, టికెట్లు సంపాయించుకున్న మేధావులు కూడా గెలుపు గుర్రం ఎక్కలేదు.
అనంతరం కూడా పవన్ అనుసరిస్తున్న వైఖరి, ఓ పార్టీకి సపోర్టు చేస్తున్నట్టుగా మాట్లాడిన విధానం వంటివి మేదావి వర్గాన్నితీవ్రంగా ఇరకాటంలోకి నెట్టాయి. ఈ క్రమంలోనే చాలా మంది సైలెంట్‌గా తప్పుకొన్నారు. ఇప్పుడు ఇదే బాటలో ఒకరిద్దరు నాయకులు కూడా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. మరి వీరిని పవన్ నిలబెట్టుకుంటారా? లేక పోతేపోనీ.. అని వదులుకుంటారా? చూడాలి.