ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. మొత్తం నాలుగు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే మూడు రాజధానులు ప్రతిపాదిస్తూ హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికకు ఆమోద ముద్ర వేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనేది ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష అని తెలిపారు.
భావితరాల కోసం పోరాడతామని, అమరావతిని నిలబెట్టుకుంటామని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మూడు రాజధానులను ఒప్పుకోబోమని చంద్రబాబు తెలిపారు. అరెస్టులు చేయించడమనేది పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు. రాష్ట్ర విభజన బిల్లు తీసుకొచ్చినప్పుడు కూడా ఇంతగా బందోబస్తు పెట్టలేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.