ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో అసలు జనసేన, దానితో పొత్తు పెట్టుకున్న బిజెపి వైఖరి ఏంటీ అనేది ఎవరికి ఏ విధంగాను స్పష్టత అనేది రాని పరిస్థితి నెలకొంది. రాజకీయంగా రెండు పార్టీలు బలంగా ఉన్నా కేంద్రంలో బలం ఉన్న నేపధ్యంలో ఆ రెండు పార్టీల వైఖరిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అమరావతికి మద్దతు ప్రకటించగా, బిజెపి కూడా అమరావతినే రాజధానిగా ఉంచాలని కోరింది.
ఈ మేరకు ఉద్యమం చేస్తామని కూడా బిజెపి నేతలు పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే మూడు రాజధానులతో వైసీపీ వినాశనానికి పునాది పడిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతిలో అసెంబ్లీ ముట్టడికి వెళ్లిన రైతులను పోలీసులు అడ్డుకోవడంతో కొందరికి గాయాలు అయ్యాయి. వారిని పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్ళగా ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు.
జనసేన పార్టీ కార్యాలయం నుంచి వారిని బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. అమరావతిలో జనసేన పార్టీ ఆఫీసు వద్దకు వచ్చిన కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇవాళ జగన్ మూడు రాజధానులు అంటున్నారు. రేపు మరొకరొచ్చి ఏడు రాజధానులు అంటే అయిపోతుందా? అని నిలదీసిన పవన్ కళ్యాణ్, ఎప్పటికైనా అమరావతే రాజధాని అని ఆయన స్పష్ట౦ చేసారు.
ఎక్కడికి వెళ్లినా మళ్లీ ఇక్కడకు తిరిగిరావడం ఖాయమన్నారు పవన్. బీజేపీ నేతలు నాకు ఒక్క మాట మాత్రం హామీ ఇచ్చారని, అమరావతే రాజధాని అని వారు చెప్పారని పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. అమరావతి రైతులకు అండగా ఉంటామని స్పష్టం చేసిన ఆయన, ఏ విధంగా ముందుకెళ్లాలనేది బీజేపీతో చర్చించి ముందుకెళతామని అన్నారు. ప్రస్తుతం రాజధాని తరలింపు తాత్కాలికమేనని, శాశ్వత రాజధాని అమరావతే అవుతుందని అన్నారు.