తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. ముఖ్యంగా మహిళా సమాఖ్య సభ్యులకు ఏడాదికి రెండు నాణ్యమైన చీరలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నారాయణపేట జిల్లా అప్పక్ పల్లెలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. మొదటగా ప్రతీ జిల్లాలో ఒక చోట ప్రభుత్వ భూముల్లో మహిళా సమాఖ్యలకు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తామన్నారు. తరువాత అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కొక్కటి చొప్పున ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా మహిళా సమాఖ్యలో మొత్తం 67లక్షల మంది ఉన్నారు. ఈ సభ్యులకు ఇకపై రూ. 1000 కోట్ల ఖర్చుతో ఏడాదికి రెండు మంచి చీరలు ఇస్తాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు. శిల్పారామం వద్ద మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో స్కూళ్ల నిర్వహణ బాగుండేలా మహిళలు చర్యలు తీసుకోవాలి అని రేవంత్ రెడ్డి అన్నారు.