వరంగల్ మామునూర్ ఎయిర్పోర్టు క్రెడిట్ కోసం కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు పోటాపోటీగా నిర్వహించిన ప్రదర్శలు రెండు పార్టీల మధ్య తోపులాటకు దారితీశాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మామునూర్ ఎయిర్పోర్టు మంజూరు ఘనత తమదంటే తమదంటూ బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల పరస్పరం తలపడ్డాయి. ఎయిర్ పోర్టు నిర్మాణానికి కేంద్రం అనుమతించినందుకు ప్రధాని మోడీకి పూలాభిషేకం చేసేందుకు బీజేపీ శ్రేణులు మామునూరు ఎయిర్ పోర్టు దగ్గరకు ప్రదర్శనగా చేరుకున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ఎయిర్పోర్టు రెడీ అవుతుందంటూ కాంగ్రెస్ శ్రేణులు సైతం పోటీ ప్రదర్శన నిర్వహించాయి.
ఈ సందర్భంగా రెండు పార్టీల శ్రేణులు ఎయిర్ పోర్టు వద్ద పోటాపోటీ నినాదాలు.. వాగ్వీవాదాలకు దిగాయి. ఇరువర్గాల మధ్య తోపులాట నెలకొనగా పోలీసులు వారిని అడ్డుకొని అక్కడనుంచి చెదరగొట్టారు. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎయిర్ పోర్టు వ్యవహారం కాస్త రాజకీయంగా ప్రచారాంశంగా మారింది.