మన మిత్ర యాప్ ని ప్రపంచంలోనే చాలా మెరుగ్గా తీర్చిదిద్దుతామని ఏపీ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. అసెంబ్లీలో వాట్సాప్ గవర్నెన్స్ పై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జూన్ 30వ తేదీ నాటికి వాట్సాప్ ద్వారా 500 రకాల పౌరసేవలు అందుబాటులో ఉంటాయన్నారు. 100 రోజుల్లో ఏఐ ఆధారిత వాయిస్ ఎనేబుల్ సేవలు తీసుకొస్తామన్నారు. కేవలం 10 సెకన్లలోనే పౌరులకు సేవలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం అన్నారు నారా లోకేశ్.
సైబర్ సెక్యూరిటీ విషయంలో ఎట్టి పరిస్థితిలో రాజీ పడేది లేదన్నారు. వ్యక్తిగత డేటాను ఎక్కడ ఎవ్వరితో కూడా పంచుకోవడం లేదన్నారు. పూర్తిగా ఎన్ క్రిప్టెడ్ డేటా మాత్రమే నేరుగా వినియోగదారులకు వెళ్తుందని తెలిపారు. ఐటీ చట్టం ప్రకారం.. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా జారీ అయ్యే పత్రాలకు పూర్తి చట్టభద్రత ఉందన్నారు. సాంకేతిక విషయంలో పొరుగు రాష్ట్రాలు కూడా మనతో పోటీ పడుతున్నాయని.. వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఏపీ ప్రారంభించగానే మహారాష్ట్ర కూడా నెల తరువాత దీనిని మొదలు పెట్టిందని వెల్లడించారు. గ్రామ, వార్డు, సచివాలయాలు తీసుకొచ్చిన తరువాత గత ప్రభుత్వం మీ సేవా కేంద్రాల నుంచి కొన్ని సేవలను తొలగించిందని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ వచ్చినంత మాత్రానా మీసేవ సేవలను తొలగించమని తెలిపారు మంత్రి నారా లోకేశ్.