పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తున్నారు. నిరసనల పేరుతో హింసకు పాల్పడటం వల్ల సమాజం, దేశం బలహీనపడుతుందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోహింద్ హితవు పలికారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభ సూచకంగా రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి శుక్రవారంనాడు ప్రసంగించారు. ‘కలిసి మాట్లాడుకోవడం, చర్చల ద్వారా ప్రజాస్వామ్యం పటిష్టమవుతుందని తమ ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. నిరసనల పేరుతో హింస ఏరూపంలో ఉన్నా అది సమాజాన్ని, దేశాన్ని బలహీన పరుస్తుంది’ అని కోవింద్ అన్నారు.
సీఏఏకు వ్యతిరేకంగా జామియా ఏరియాలో గురువారంనాడు నిరసన తెలిపిన విద్యార్థులపై సాయుధుడు ఒకరు కాల్పులు జరిపిన నేపథ్యంలో రాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే ప్రజలకు ప్రయోజనం చేకూర్చే అనేక కొత్త చట్టాలను ప్రభుత్వం తీసుకొచ్చిందని కోవింద్ చెప్పారు. సులభతర వాణిజ్య విధానంలో భారత్ మెరుగైన ర్యాంకును సాధించిందని తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో 370, 35ఏ అధికరణలను రద్దు చేయడం కేవలం ఓ చారిత్రాత్మక నిర్ణయం మాత్రమేకాదని, జమ్ముకశ్మీర్, లఢక్ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి మార్గం సుగమమైందని ఆయన చెప్పారు. ముస్లిం మహిళలకు న్యాయం చేసేలా ట్రిపుల్ తలాక్ రద్దు చేసిందన్నారు.