అక్రమాస్తుల కేసులో కోర్టుకు కచ్చితంగా హాజరు కావాల్సిందేనని సీబీఐ కోర్టు స్పష్టం చేసినా ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హాజరు కాలేదు. దీంతో కోర్టు తదుపరి నిర్ణయం ఏమిటన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి హోదాలో బిజీగా ఉంటున్నందున కేసులో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో రెండుసార్లు జగన్ పిటిషన్ దాఖలు చేసినా కోర్టు వాటిని కొట్టేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు జగన్ ఈరోజు కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నా హాజరు కాలేదు.
ఇక జగన్ హాజరుకానందున నోటీసులు జారీ చేస్తుందా..? లేకుంటే హైకోర్టు విచారణను పరిగణనలోకి తీసుకుంటుందా..? లేకపోతే జగన్‌కు నోటీసులు ఇస్తుందా..? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే.. జగన్ తరఫు న్యాయవాది వేసిన ఆబ్సెంట్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు అనుమతించింది. అనంతరం జగన్ అక్రమాస్తుల కేసు విచారణను ఫిబ్రవరి 7కు వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. కాగా.. జగన్ అక్రమాస్తుల కేసులో అయోధ్య రామిరెడ్డి, ఇందూ శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, రిటైర్డ్ అధికారులు శామ్యూల్, మన్మోహన్, రాజగోపాల్, కృపానందం, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.