రెండు మొక్కలు నాటి పారిపోతే ఎలా సాయి రెడ్డి గారు?: బుద్ధా వెంకన్న

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించిన సంగ‌తి తెలిసిందే. ప్రతిపక్ష నేతగా ఆయన చేస్తోన్న విమర్శలను తిప్పికొట్టారు. ‘ప్రతిపక్ష నేతగా 9 నెలల్లో చేసిందేమిటంటే… ఇసుక మాఫియాను రక్షించేందుకు ఇస్కో… ఉస్కో అంటూ శివాలూగాడు. అవినీతి అధికారులకు కాపలాదారయ్యాడు. పొర్లు దండాలతో బొంగరంలా తిరగడమే మిగిలింది’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన విమర్శలకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ‘చంద్రబాబు గారు చేసిన అభివృద్ధికి పార్టీ రంగులు వేసుకోవడానికే మీకు 9 నెలలు సరిపోలేదు.

చంద్రబాబు గారు కట్టిన భవనాలకు మళ్లీ జగన్ గారితో రిబ్బన్ కటింగ్ చేయించడం సిగ్గుగా లేదా సాయి రెడ్డి గారు?’ అని ట్వీట్ చేశారు. ‘9 నెలల కాలంలో ముఖ్యమంత్రిగా జగన్ రాయలసీమకి, ఉత్తరాంధ్రకి, రాష్ట్రానికి ఏం చేశారో చర్చకు నేను సిద్ధం. ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేసింది లేదు’ అని బుద్ధా వెంకన్న విమర్శించారు. ‘గ్రీన్ ఛాలెంజ్ అని రెండు మొక్కలు నాటి పారిపోతే ఎలా విజయసాయిరెడ్డి గారూ? బుద్ధా ఛాలెంజ్ స్వీకరించండి. మూడు ముక్కల రాజధాని అంటున్నారు, రాష్ట్ర అభివృద్ధిని ప్రతిపక్షం అడ్డుకుంటుంది అని ముసలి కన్నీరు కారుస్తున్నారు’ అని విమర్శలు గుప్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news