కెసిఆర్’ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ పేరు ఒక సంచలనం. సాదా సీదా వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించిన ఈయన నేడు ఒక రాష్ట్రానికి అధినేతగా ఎదిగారు. ఈ ప్రయాణంలో ఎన్నో విజయాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో రాజకీయ ఒడిదుడుకులు, ఉమ్మడి పాలనలో ఆయన ఎదుర్కొన్న ఎన్నో ఇబ్బందులు. తెలంగాణా రాష్ట్ర సాధన కోసం తన అవమానాన్ని దిగమింగుకుని పార్టీ పెట్టి నేడు ప్రత్యేక తెలంగాణా సాధించి తొలి ముఖ్యమంత్రిగా ఆయన ఎదిగిన తీరు అందరికి ఆశ్చర్యమే. చాలా మందికి కెసిఆర్ అనగానే ఆయన ఒక ఉద్యమ నేతగానే తెలుసు.
కాని ఆయన ఒక పరిపాలనా దక్షుడు అనే విషయం ముఖ్యమంత్రి అయ్యాక గాని తెలంగాణా తో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా స్పష్టత రాలేదు. 2014 లో తెలంగాణా ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత కెసిఆర్, హైదరాబాద్ పై నిర్వహించిన ఒక సమీక్షా సమావేశం అప్పట్లో ఒక సంచలనం. హైదరాబాద్ స్థితిగతుల గురించి, అక్కడి ట్రాఫిక్ సమస్యల గురించి, అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ఆయన అధికారులకు నోటి మాటతో చెప్పిన విధానం చూసి సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా షాక్ అయ్యారు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణా పచ్చగా ఉండాలని, తాను కలలు కన్న రాష్ట్రం నేడు సుభీక్షంగా ఉండాలని, ఎన్నో అవమానాలను, ఎన్నో విమర్శలను మోస్తూ ఆయన వేసిన అడుగులు దగ్గరగా గమనించిన వాళ్ళకే తెలుసు. నా తెలంగాణా కోటి రతనాల వీణ అని ఒక కవి చెప్తే, ఆ కోటి రతనాల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న యోధుడు కెసిఆర్. రాజకీయంగా, సామాజికంగా వెనుక బడిన తెలంగాణా తల్లిని ఆయన ముందుకి నడిపిస్తున్న తీరు చూసి ఉమ్మడి పాలనలో మంత్రులుగా పని చేసిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు.
తెలంగాణా ఏర్పడితే మావోయిస్ట్ లు పెరుగుతారు, నీటి సమస్యలు, కరెంట్ సమస్యలు ఇలా ఎన్నో వస్తాయని కిరణ్ కుమార్ రెడ్డి (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి) చెప్తే అప్పుడు తెలంగాణా సమాజం నిజమే అనుకుంది. కాని అధికారంలోకి వచ్చిన తర్వాత నీ కాంగ్రెస్ పాలనలో 7 గంటల కరెంట్ ఇవ్వడానికి నా తెలంగాణా రైతులకు నరకం చూపించావ్ అని అంటూ నేను నా రైతు బిడ్డలకు 24 గంటలు కరెంట్ ఇస్తాను అంటూ సంచలన నిర్ణయం తీసుకుని దేశాన్నే ఆశ్చర్యానికి గురి చేసారు.
ఆసరా పెన్షన్ లు, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, ఇలా కెసిఆర్ మదిలో మెదిలిన ఎన్నో ఆలోచనలు నేడు తెలంగాణా తల్లి కడుపులోకి అయిదేళ్ళు వెళ్తున్నాయి. రాజకీయం అనేది నాయకుడి కోసం చేసేది కాదు ప్రజల కోసం అని నిరూపించిన నాయకుడు కెసిఆర్. వందల మంది తెలంగాణా బిడ్డలు అమరులై తెలంగాణా సాధన కోసం తెలంగాణా తల్లి నేల మీద నుంచి వెళ్ళిపోతే, వారి తల్లులకు గర్భ శోకం మిగిలిపోతే నేను ఉన్నాను అమ్మా మీకోసం అంటూ నేడు రాష్ట్రాన్ని, వారు అర్పించిన ప్రాణాలకు ఒక సార్ధకత చేకూరుస్తూ ముందుకి వెళ్తున్నారు.
తెలంగాణా అనేది నా కోసం తెచ్చింది కాదు మీ కోసం, మన బిడ్డల కోసం తీసుకొచ్చింది అనే కెసిఆర్, తెలంగాణా ప్రజలు ఆందోళనలు చేస్తుంటే, మీరు నా బిడ్డలు మీరు బాగుండాలి అంటూ వారి సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తూ వేసే అడుగులు అన్నీ కూడా ఇతర నాయకులకు ఆదర్శమే. 2018 లో ముందస్తు ఎన్నికలకు వెళ్తే, నియంత పాలన నుంచి తెలంగాణా తల్లి బయటపడింది అన్నారు. ఊహించని విధంగా విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా కెసిఆర్ సాధించిన విజయం ఎందరో నోళ్ళ ను మూయించింది.
నేడు తెలంగాణా అభివృద్ధిలో ముందుకి సాగుతుంది. సంక్షేమ కార్యక్రమాలు ప్రతీ తెలంగాణా బిడ్డకు అందుతున్నాయి. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి అంటూ కెసిఆర్ గ్రామాలను, పట్టణాలను అందంగా తయారు చేస్తున్నారు. యువతకు ఉపాధి విషయంలో ఆయన తీసుకునే నిర్ణయాలు, తనయుడు కేటిఆర్ సహకారంతో ఇండియా సిలికాన్ వ్యాలీ గా ఉన్న హైదరాబాద్ లో భారీగా ఐటి కంపెనీలు వస్తున్నాయి. కక్ష సాధింపు రాజకీయాలకు వెళ్ళని కెసిఆర్, తనను ఇబ్బంది పెట్టాలి అనుకున్న వాళ్లకు తన వ్యూహాలతో చుక్కలు చూపిస్తారు.
ఇప్పుడు తెలంగాణాలో తెరాసని ఎదుర్కొనే పార్టీ లేదు. కెసిఆర్ కి ఎదురొడ్డి నిలబడే రాజకీయ నాయకుడు లేరు. ఆయన వ్యూహాలను ఎదుర్కొని చేసే రాజకేయమూ లేదు. ఎందుకంటే తెలంగాణా లో కెసిఆర్ యుగానికి ఒక్కడు. కేంద్రంతో విభేదిస్తూనే ఎం కావాలో అది తెచ్చుకోవడమే కాకుండా తనను ఇబ్బంది పెడితే తాను ఏంటో చెప్తూ ముందుకి వెళ్తున్నారు. తెలంగాణా ప్రయోజనాలను నేను పణంగా పెట్టేది లేదు అంటూ ఏ రాజకీయ ప్రయోజనాన్ని అయినా తృణప్రాయంగా వదులుకోవడం కెసిఆర్ నైజం.
ఉమ్మడి పాలనలో నా తల్లి కడుపు కోతకు గురైంది. నేడు నేను దాన్ని అధిగమించాలి… పక్క రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపు ఉంది. గందరగోళం ఉంది. నా తెలంగాణా అలా ఉండకూడదు. నాకు తెలంగాణా ప్రజలు ప్రయోజనాలు ముఖ్యం. ఏ రాజకీయం అయినా నా తెలంగాణా కోసమే అంటూ కెసిఆర్ ముందుకి వెళ్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం. మంత్రి పదవి రాలేదని ఆ నాడు తాను కుంగిపోయి రాజకీయాల నుంచి తప్పుకుని ఉంటే నేడు తెలంగాణా భవిష్యత్తు ఇంత అందంగా కనపడేది కాదు. అందుకే కెసిఆర్ యుగానికి ఒక్కడు.