చరిత్ర ఎప్పుడు మొదలైందో తెలుసుకోవచ్చు.. కానీ, ఎప్పుడు ముగుస్తుందో మాత్రం తెలియదని అంటాడు ఫ్రెంచ్ కవి! అదేవిధంగా భారత్‌లో అమెరికా ప్రెసిడెంట్ల పర్యటనలు కూడా ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చినవి కాదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కూడా అమెరికా-భారత్‌ల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే అక్కడి అధినేతలు ఇక్కడకు , ఇక్కడి ప్రధానులు అక్కడికి రాకపోకలు సాగిస్తున్నారు. వివిధ ఒప్పందాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ట్రంప్ పర్యటన నేపథ్యంలో ఆసక్తిగా మారిన అగ్రరాజ్యాధినేతల పర్యటనపై ప్రత్యేక కథనం ఇదీ..
+ సరిగ్గా 60 ఏళ్ల క్రితం 1959లో నాటి అమెరికా అధ్యక్షుడు డ్వైట్ డి ఐసన్‌హోవర్ తొలిసారిగా భారత్ గడ్డపై అడుగు పెట్టారు. ఆరు రోజుల పాటు మన దేశంలో పర్యటించారు. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న ఆ సమయంలో ఐసన్‌హోవర్ పర్యటన ఇరు దేశాల సంబంధాల ఏర్పాటుకు వీలు కల్పించింది. తాజ్‌మహల్‌ని సందర్శించారు. పార్లమెంటు ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించారు.
+ 1969లో అప్పటి అమెరికా అధినేత రిచర్డ్ ఎం నిక్సన్ భారత్‌కు వచ్చారు. జులై 31న ఢిల్లీలో 22 గంటలు గడిపారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీతో నెలకొన్న అపోహల్ని తొలగించుకొని, అమెరికా, భారత్ మధ్య సాన్నిహిత్యం పెంచుకోవడానికే నిక్సన్ భారత్‌కు వచ్చారని వార్తలు వచ్చాయి.
+ 1978 జనవరిలో అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ భారత్‌కు వచ్చారు. అప్పట్లో మొరార్జీ దేశాయ్ ప్రధాని గా ఉన్నారు. 1971లో బంగ్లా యుద్ధం, 1974లో భారత్ అణుపరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో అమెరికా, భారత్ మధ్య సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతల్ని తగ్గించడం కోసమే కార్టర్ వచ్చారు. తల్లితో కలిసి వచ్చిన ఆయన పార్లమెంటులో ప్రసంగించారు.
+ 2000 సంవత్సరంలో అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ తన కుమార్తె చెల్సేతో కలిసి భారత్‌లో పర్యటించారు 1999 కార్గిల్ యుద్ధ సమయంలో బిల్ క్లింటన్ జోక్యం చేసుకోవడంతో ఇరు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడింది. దీంతో ఆనాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి బిల్ క్లింటన్‌కి రాచమర్యాదలు చేశారు. క్లింటన్ హయాంలోనే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక, ఆర్థిక సంబంధాలు బలపడ్డాయి. ఆగ్రా, జైపూర్, ముంబై, ఢిల్లీలతో పాటు హైదరాబాద్‌కి కూడా క్లింటన్ వచ్చారు.
+ 2006లో జార్జ్ డబ్ల్యూ బుష్, ఆయన సతీమణి లారా బుష్ భారత్‌కు వచ్చి మూడు రోజులు పర్యటించారు. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ బుష్ పర్యటనని గొప్పగా తీసుకున్నా, బుష్ పార్లమెంటుని ఉద్దేశించి ప్రసంగించలేదు.
+ 2010 అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్‌లో పర్యటించారు. అప్పట్లో ప్రధాని మన్మోహన్ సింగ్ ఉన్నారు. అయితే, 2015లోనూ ఆయన రెండోసారి భారత్‌కు వచ్చారు. అప్పట్లో ప్రధానిగా మోడీ ఉన్నారు. 2015 గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఒబామా విచ్చేయడం గమనార్హం. ఇలా గణతంత్ర ఉత్సవాలకు అమెరికా అధ్యక్షుడు హాజరుకావడం అదే తొలిసారి.
+ 2020 ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ తన సతీమణితో కలిసి భారత్‌కు విచ్చేస్తున్నారు. తాజ్‌మహల్‌ను సందర్శిస్తున్న రెండో అగ్రరాజ్య అధినేత ట్రంప్ కావడం గమనార్హం. అదే సమయంలో ఆయన రాష్ట్రపతి భవన్‌కే పరిమితం కానున్నారు. పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించడం లేదు.