ఆంధ్రప్రదేశ్ రాజ్యసభలో హోం మంత్రి అమిత్ షా వేలు పెట్టారు. ఎన్డియే కి రెండు స్థానాలు అడుగుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఏపీ లో ఈ నెలలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆ స్థానాలకు ఎవరిని ఎంపిక చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. నాలుగు రాజ్యసభ స్థానాలను అధికార పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.
అయితే ఇప్పుడు ఆ నలుగు స్థానాలకు మంత్రులు మోపిదేవి వెంకట రమణ తో పిల్లి సుభాష్ చంద్రబోస్ తో పాటుగా అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని పేర్లను జగన్ దాదాపుగా ఖరారు చేసారు. అయితే రెండు స్థానాలు ఎన్డియే అడుగుతుందని అంటున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా వేలు పెడుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఒక సీటుని అంబాని సూచించిన వ్యక్తికి జగన్ దాదాపుగా ఖరారు చేసారు.
అయితే ఒక కీలక నేతకు కూడా రాజ్యసభ అడుగుతున్నట్టు సమాచారం. కర్ణాటకలో ఒక మాజీ ఎమ్మెల్యేని రాజ్యసభకు పంపే అవకాశాలు ఉన్నాయని అధికార పార్టీ నేతలు అంటున్నారు. కీలక రాష్ట్రాల్లో పట్టు కోల్పోయిన బిజెపి ఇప్పుడు రాజ్యసభ సీట్లను బెదిరించి భయపెట్టి లాక్కునే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తుంది. ఇప్పటికే ఆ మాజీ ఎమ్మెల్యేని కూడా జగన్ వద్దకు పంపించారని అంటున్నారు.
దీనిపై జగన్ కూడా అసహనంగా ఉన్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. రాజ్యసభ అనేది చాలా కీలకమని అలాంటి కీలక స్థానాలను ఎంత స్నేహం ఉన్నా ఏ విధంగా వదులుకుంటారు అంటూ వైసీపీ నేతలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ వైఖరి మంచిది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ప్రాంతీయ పార్టీల మీద అనవసర పెత్తనం చేస్తున్న ఆ పార్టీ ఇలాంటి రాజకీయాలు చేయడం భావ్యం కాదని అంటున్నారు.