ఈ మధ్య కాలంలో స్మార్ట్‌ఫోన్ లు మరియు కంప్యూటర్ ల వినియోగం మరింత ఎక్కువ అయిపోయింది. సమయం దొరికినప్పుడు సోషల్ మీడియాలో ఎన్నో మొబైల్ అప్లికేషన్ లను ఉపయోగించడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఎక్కువ సమయం స్క్రీన్ చూస్తే, కళ్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. స్క్రీన్ ను ఎక్కువ సమయం చూస్తే, కళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల కళ్లకు తీవ్రమైన అలసట, మసకబారడం, తలనొప్పి వంటి మొదలైన సమస్యలు ఎదురవుతాయి. అయితే కొన్ని యోగా టెక్నిక్స్ ద్వారా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.
కంటి పై ఒత్తిడి పడినప్పుడు, యోగా ఆసనాలను చేయడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. కంటి ముందు ఒక పెద్ద గడియారం ఉందని ఊహించుకుని, తలను కదిలించకుండా కంటి కనుపాపలతో గడియారంలో ఉండే సంఖ్యలను వరుసగా చూడాలి. దీని వల్ల కంటి కండరాలు అన్ని దిశల్లో కదులుతాయి. పైగా ఇదే విధానాన్ని యాంటీ క్లాక్ వైస్ కూడా పాటించి, కళ్లను కదిలించాలి. దీంతో పాటుగా రెండు అరచేతులను వేడి ఎక్కే వరకు బాగా రుద్దుకుని, కళ్లను మూసుకుని, అరచేతులను కంటి పై ఉంచాలి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను పాటించడం వల్ల కళ్లకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది.
ఈ పద్ధతిని పాటించి కంటి పై చేతులను ఉంచడం వల్ల కళ్లకు మరియు ఆప్టిక్ నరాలకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. పైగా ఈ పద్ధతిని పాటించేటప్పుడు కంటి పై ఎటువంటి ఒత్తిడి లేకుండా పూర్తిగా చీకటిగా ఉండేలా చూసుకోవాలి. స్క్రీన్ ముందు ఎక్కువ సమయం ఉండాల్సివస్తే కళ్ళు ఎంతో ఒత్తిడికి గురవుతాయి అలాంటప్పుడు తరచుగా కళ్ళు రెప్పలను వేస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన కళ్ళు పొడిబారకుండా ఉంటాయి. కంటికి మంచి వ్యాయామం చెయ్యాలంటే ముక్కు పై వేలు పెట్టి వేలు ని చూడాలి తరువాత దూరంగా ఉండే వస్తువును చూడాలి. ఇలా చేయడం వల్ల కంటి పై ఒత్తిడి తగ్గుతుంది.