కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేటీఆర్ మాట్లాడుతూ.. రూ.70 వేల కోట్లు రైతుబంధు వేసిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. అదే కాంగ్రెస్ పాలనలో ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే రైతుబంధు పడుతుందని తెలిపారు.
బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుందని, తాము ఎవరితోనూ కలిసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. కరోనా సంక్షోభంలోనూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను తాము ఆపలేదని, రాష్ట్రంలో ఎరువుల కోసం యుద్ధం చేయాల్సి వస్తోందని వాపోయారు. రాష్ట్రంలో పాలు ఇచ్చే బర్రెను పక్కకు పెట్టి దున్నపోతును తెచ్చుకున్నారన్నారు. కేసీఆర్ మరోసారి సీఎం అయ్యాక మన కష్టాలు పోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.