బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం తెలంగాణ ఉద్యమం తరహాలోనే ఉద్యమిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్ చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ‘చలో ఢిల్లీ’ పేరుతో రేపటి నుంచి ఈనెల 7 వరకు స్టేట్ కాంగ్రెస్ యాక్షన్ పార్ట్న ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘చలో ఢిల్లీ’ కార్యక్రామానికి బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా తమతో పాటు కలిసి రావాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దామని అన్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలో ఉద్యమిద్దామని పేర్కొన్నారు.
బీసీ రిజర్వేషన్ల పెంపు నిర్ణయం ఎవరికీ వ్యతిరేకం కాదని అన్నారు. బీసీ కోటాలో పెంపుపై బీజేపీ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అందుకే ముస్లింలను తెరపైకి తీసుకొచ్చిందని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యబద్ధంగా బీసీ రిజర్వేషన్లపై చట్టాన్ని చేసి గవర్నర్ ఆమోదానికి ఆర్డినెన్స్ పంపామని.. కానీ, విపక్షాలు తమది డ్రామా అంటూ కామెంట్స్ చేయడం సోచనీయమని అన్నారు. బలహీనవర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ చేస్తున్న ఈ పోరాటంలో అన్ని పార్టీలు పాల్గొని తమ మద్దతును ఇవ్వాలని పొన్నం ప్రభాకర్ అన్నారు.