లైసెన్స్ కలిగి ఉన్న కేబుళ్లు తప్ప విద్యుత్ స్థంబాలకు మరే కేబుళ్లు ఉంచవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. జీహెచ్ఎంసీలో కేబుళ్ల తొలగింపు పై ఎయిర్ టెల్ పిటిషన్ పై ఇవాళ జస్టీస్ నగేశ్ భీమపాక మరోసారి విచారణ జరిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటంపై న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రామంతాపూర్ లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి కేబుల్ వైర్ నుంచి విద్యుత్ సరఫరా కావడం వల్ల ఐదుగురు మరణించిన ఘటనను ఈ సందర్భంగా జడ్జీ ప్రస్తావించారు.
బర్త్ డే రోజు తండ్రికి తలకొరివి పెట్టిన బాలుడి ఘటన పై ఉధ్వేగ భరిత వ్యాఖ్యలు చేశారు. కేకు కోయాల్సిన తొమ్మిదేళ్ల బాలుడు తలకొరివి పెట్టడం కలిచివేసిందన్నారు. పసి హృదయం పగిలిపోయింది. అందరం బాధ్యులమేనన్నారు. సమాజం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. చలనరహిత చట్టాలతో ప్రజల ప్రాణాలను ఎలా కాపాడగలమని ప్రశ్నించారు. విద్యుత్ స్థంబాలపై కేబుల్ వైర్లను యుద్ధప్రాతిపదికన తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.